జిల్లాలో ఎక్సైజ్ నేరాలపై దృష్టి సారించి వాటి నివారణకు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.నాగలక్ష్మి తెలిపారు.
కడప అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎక్సైజ్ నేరాలపై దృష్టి సారించి వాటి నివారణకు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.నాగలక్ష్మి తెలిపారు. ఈనెల 4వ తేది తిరుపతి కేంద్రంగా జోనల్ స్థాయి సమావేశాన్ని కమిషనర్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కడప, ప్రొద్దుటూరు డివిజన్ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ జిల్లాలో అన్ని స్టేషన్ల పరిధిలో ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే కార్యక్రమాలపై దృష్టి పెట్టి వాటిని అరికట్టేందుకు కృషి చేయాలన్నారు.
184 మద్యం షాపుల పరిధిలో ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు షాపులు తెరవాలని, మిగతా సమయాల్లో షాపులు తెరిస్తే వాటికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మద్యం కొనుగోలు విషయంలో సంబంధిత యజమానులు జాగ్రత్త వహించాలన్నారు. ప్రభుత్వానికి ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయాల్సిన మొత్తాన్ని మద్యం డిపోలకు నేరుగా చెల్లించాలన్నారు. ఒకరి మద్యం షాపులోని స్టాక్‌ను మరొకరు ఉపయోగించరాదన్నారు. అలా చేస్తే వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు మద్యాన్ని విక్రయించరాదన్నారు. పర్మిట్ రూములను నిబంధనల మేరకు ఉపయోగించాలన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.