చెత్త నుంచి విద్యుత్.. స్వచ్ఛ విశాఖే టార్గెట్
♦ కర్మాగారం ఏర్పాటుపై సమీక్ష
♦ సెప్టెంబర్ నాటికి డీపీఆర్
♦ స్థలం కేటాయించాలన్న ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి
విశాఖపట్నం సిటీ : జీవీఎంసీ నుంచి ఉత్పన్నమయ్యే చెత్త నుంచి విద్యుత్ తయారీకి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ అన్నారు. పాత కౌన్సెల్ హాల్లో శనివారం మధ్యాహ్నం జీవీఎంసీ ఉన్నతాధికారులందరితో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ కర్మాగారం నిర్మించడానికి అవసరమయ్యే స్థలాన్ని ముందుగానే గుర్తించాల్సిందిగా సూచించారు. నీరు, చెత్త కోసం డెవలపర్స్‌తో అంగీకార పత్రాలను రూపొందించాలని ఆదేశించారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ వల్ల నగరంలో నిత్యం పేరుకుపోయే టన్నుల కొద్దీ చెత్తకు పరిష్కారం దొరికినట్టేనని స్పష్టం చేశారు.
ఉత్పత్తి అయిన విద్యుత్ స్థానిక అవసరాలు తీర్చడంతో పాటు ఆదాయం కూడా సమకూర్చుకోవచ్చని వెల్లడించారు. ప్రతిపాదనలు సిద్ధం చేసేటప్పుడే అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి డీటెయిల్డ్‌ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) రూపొందించాలని సూచించారు. కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నగరంలో చెత్త సమస్య పరిష్కారమైతే స్వచ్ఛ విశాఖ లక్ష్యం నెరవేరినట్టేనని అభిప్రాయపడ్డారు. నగరం నలుమూలలు నుంచీ రోజుకు 800 నుంచి వెయ్యి టన్నుల చెత్త లభ్యమవుతుందని చెప్పారు. ప్రాజెక్టు అవసరాలకు అవసరమైన నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సూపరింటెండెంగ్ ఇంజినీర్‌ను ఆదేశించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన సంచాలకులు కన్నబాబు, స్వచ్చాంధ్ర కార్పోరేషన్ సంచాలకులు మురళీధర్, నెడ్‌క్యాప్ సంచాలకులు కమలాకరబాబు, కేపీఎంజీ ప్రతినిధి ఉదయ్, జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎన్. మోహన్‌రావు, చీఫ్ ఇంజినీర్ దుర్గాప్రసాద్, సీఎంఓహెచ్ డాక్టర్ మురళీమోహన్, పర్యవేక్షక ఇంజినీర్లు పాల్గొన్నారు.