సీఎంగా కిరణ్‌కు మూడేళ్లు పూర్తి
అడుగడుగునా టీడీపీ సహకారం
చంద్రబాబు అండతో అవిశ్వాసం గట్టెక్కిన కిరణ్
పీఆర్పీ విలీనంతో బొటాబొటిగా మనుగడ
ఏ మంత్రి పదవీ చేపట్టకుండా నేరుగా సీఎం
హైకమాండ్ ఆశీస్సులున్నా అంతర్గతంగా తిప్పలే
ఆచరణలో ప్రసరించని యువ ‘కిరణాలు’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి సోమవారానికి మూడేళ్లు పూర్తవుతున్నాయి. రాష్ట్రానికి మూడేళ్లు సీఎంగా ఉన్న ఎనిమిదో నేత కిరణ్. గతంలో మూడేళ్లకు పైబడి సీఎంలుగా పనిచేసిన వారంతా మంత్రులుగా అనుభవం గడించి ఆ పదవిలోకి వచ్చారు. కిరణ్ మాత్రం మంత్రిగా పని చేయకుండానే నేరుగా అధిష్టానం ఆశీస్సులతో పీఠాన్ని అధిష్టించారు. మూడళ్లు పదవిలో కొనసాగడంలో కిరణ్ ఘనత కన్నా ప్రతిపక్ష నేత హోదాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అడుగడుగునా అందిస్తూ వస్తున్న సహాయ సహకారాలు, రాష్ట్రం లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిలదే ప్రధాన పాత్ర. సభలో మెజారిటీ లేకున్నా, వైఎస్ హయాం నాటి సంక్షేమ పథకాలన్నింటినీ అటకెక్కించినా కేవలం బాబు దన్నుతోనే కిరణ్ కుర్చీలో కొనసాగుతున్నారు. ఈ మూడేళ్లూ ఆయన పాలన అనేక ఒడిదుడుకుల నడుమ, ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కు చందంగా సాగింది.
తెలంగాణ ఉద్యమం, పార్టీలోనే అసమ్మతి, మంత్రుల సహాయ నిరాకరణ.. ఇలా రాజకీయంగా తీవ్ర అనిశ్చితిలోనే మూడేళ్లు ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చారు. టీడీపీ ఈ మూడేళ్లూ ప్రభుత్వానికి అండదండగా ఉంటూ, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ వస్తుండటం రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విశేషమని చెప్పాలి. అసెం బ్లీలో కిరణ్ సర్కారు రెండుసార్లు అవిశ్వాసాన్ని కూడా టీడీపీ అండదండలతోనే గట్టెక్కింది. ప్రభుత్వం మైనారిటీలో ఉన్నప్పుడు కాకుండా, కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనమై, సర్కారు కూలిపోదని తేలాక మాత్రమే మొదటిసారి బాబు అవిశ్వాసం ప్రతిపాదించారు. రెండోసారి టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ అవిశ్వాసాన్ని పెట్టినప్పుడు బాబు తన ఎమ్మెల్యేలను తటస్థంగా ఉంచడం ద్వారా కిరణ్ ప్రభుత్వాన్ని గట్టెక్కించారు. కాంగ్రెస్ మైనారిటీలో పడినట్టు ఆ అవిశ్వాస తీర్మానం సందర్భంగా స్పష్టమైంది. ఇప్పుడు కూడా అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సాంకేతికంగా మెజారిటీ కనిపిస్తున్నా వాస్తవానికి పార్టీలోని అసమ్మతి, ఎమ్మెల్యేల వలసలతో కిరణ్ సర్కారు మైనారిటీలో ఉంది. పైగా మూడేళ్లలో అసెంబ్లీ సమావేశాలు కూడా ఒక్క రోజైనా సవ్యంగా సాగలేదు. నాయకుడిగా సభను సజావుగా నడిపించడంలో విఫలమయ్యారన్న పేరు కిరణ్‌కు దక్కింది.
మంత్రులతోనూ ఎగమొగమే: అధిష్టానం అండదండలు అందించినా రాష్ట్రంలో నేతలను కలుపుకుని వెళ్లడంలో అడుగడుగునా విఫలమైన కిరణ్.. సొంత కేబినెట్‌లోని సీనియర్ల నుంచే మద్దతు కరువైన సీఎంగా మిగిలారు. నిజానికి ఆయన బాధ్యతలు స్వీకరించగానే ఏర్పాటు చేసిన మంత్రివర్గ కూర్పే తీవ్ర అసమ్మతికి దారితీసింది. తమకు సరైన శాఖలు కేటాయించలేదంటూ సీనియర్ మంత్రులు అలకబూనారు. తర్వాత కూడా సీఎంకు, మంత్రులకు సయోధ్య అంతంతమాత్రంగానే సాగింది. దాంతో కేబినేట్ సమావేశాలు కూడా పెద్దగా నిర్వహించలేకపోయారు. పైగా తనకు వ్యతిరేకంగా ఉన్న మంత్రులు, ఇతర నేతలను వీలైనప్పుడల్లా పలు కేసుల్లో ఇరికించేలా కిరణ్ కుట్ర పన్నారంటూ సొంత పార్టీ నుంచే ఆరోపణలు విన్పించాయి.
పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఈ మూడేళ్లూ నిప్పూ ఉప్పుగానే నడిచింది. పీసీసీ అధ్యక్షుడు బొత్సతో కిరణ్‌కు ఎప్పుడూ పొసగలేదు. గాంధీభవన్‌లో కార్యక్రమాలకు కూడా కిరణ్ దూరంగా ఉంటూ వచ్చారు. మంత్రులు పి.శంకర్రావు, డీఎల్ రవీంద్రారెడ్డిలను కేబినెట్ నుంచి డిస్మిస్ చేశారు. తొలుత సీఎం కోటరీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల్లో పలువురు ఇప్పుడు ఆయన తీరును బహిరంగంగానే ఎండగడుతున్నారు. ఇక కేంద్ర మంత్రులు, ఎంపీలతో కూడా కిరణ్‌కు సఖ్యత దాదాపుగా కొరవడింది. కేంద్రం నుంచి ప్రాజెక్టులను సాధించడానికి ఎంపీలతో జరిగే సమావేశాలు కిరణ్ వచ్చాక పూర్తిగా బందయ్యాయి. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి, కిరణ్‌కు అనేక విషయాల్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. కిరణ్ హయాంలో ఈ మూడేళ్లలో జరిగిన పలు ఉప ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చతికిలపడింది.
పడకేసిన పథకాలు: మూడేళ్లలో కిరణ్ పాలనపరంగా సాధించింది పెద్దగా ఏమీ లేకపోగా, సొంత పథకాలు ప్రవేశపెట్టి భంగపడ్డారన్న అపప్రథను మూటగట్టుకున్నారు. తన పేరు కలిసొచ్చేలా పెట్టిన యువ కిరణాల పథకం విమర్శల పాలైంది. ఇక అమ్మహస్తం, బంగారుతల్లి పథకాల గురించైతే కనీసం కేబినెట్లో కూడా చర్చించలేదంటూ మంత్రులు బహిరంగంగానే ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఆయన శతథా ప్రయత్నించారన్న విమర్శ ఉంది. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ, 108, 104, స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితరాలకు నిధులివ్వలేదంటూ తీవ్రమైన విమర్శలొచ్చాయి. వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్తుతో పాటు అసలు చార్జీల పెంపు ఊసే లేకుండా చేయగా, కిరణ్ హయాంలో విద్యుత్తు వ్యవస్థ సాంతం అస్తవ్యస్తంగా మారింది. సాగుకు 9 గంటల విద్యుత్తు హామీ అటకెక్కింది. ఇక రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగనంతటి భారీ చార్జీల వడ్డనతో గృహ విద్యుత్తు వినియోగదారుల నడ్డి విరిచారు.
వినూత్న కార్యక్రమాలు: సీఎంవో
మూడేళ్లుగా వినూత్న కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఎనిమిదేళ్లుగా అమలు చేస్తున్న పలు పథకాలను కిరణ్ కొనసాగిస్తున్నారని ప్రభుత్వం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందిరమ్మ బాట, రచ్చబండ, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, ఇందిరాక్రాంతి పథం తదితరాలకు కిరణ్ ప్రాధాన్యమిచ్చారని పేర్కొంది. ‘‘108, 104లను మరిన్ని అదనపు సౌకర్యాలతో నిర్వహిస్తున్నారు. జలయజ్ఞంలో భాగంగా 16 ప్రాజెక్టులను పూర్తిగా, 23 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తిచేసి 21.43 లక్షల ఎకరాలకు సాగునీంరదించాం. రాజీవ్ యువ కిరణాలు, అమ్మ హస్తం, బంగారు తల్లి వంటి పథకాలు ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం, కౌలుదారుల చట్టం, ఇందిర జలప్రభ, ఇందిరమ్మ పచ్చతోరణం, మీ సేవ కేంద్రాలకు శ్రీకారం చుట్టారు. ఔటర్ రింగ్‌రోడుతో పాటు రాజధాని పరిసరాలకు నీరందించేందుకు కృష్ణా 3వ దశ త్వరలో పూర్తవనున్నాయి’’ అని తెలిపింది.