వచ్చినట్టే వచ్చి..
Published Fri, Nov 1 2013 3:28 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి వస్తున్నారని జిల్లా అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. వందలాది పోలీసుల హైరానా పడ్డారు. ఇదిగో వస్తున్నారు, అదిగో వస్తున్నారంటూ ప్రజలంతా ఎదురుచూశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇదే తంతు. చివరకు చావుకబురు చల్లగా చెప్పినట్టు ముఖ్యమంత్రి పర్యటన రద్దయ్యిందనే కబురు అందింది. ఇదీ గురువారం జిల్లాలో నెలకొన్న పరిస్థితి. లక్షలాది రూపాయలు వెచ్చించి చేసిన ఏర్పాట్లు వృథా కావడంతోపాటు అత్యంత కీలకమైన సమయంలో జిల్లా అధికారులు, వందలాది ఉద్యోగులు, పోలీసులు ఒక రోజంతా ముఖ్యమంత్రి కోసం పడిగాపులు కాసి చివరకు ఉసూరుమంటూ వెనుతిరగాల్సివచ్చింది.
భారీ వర్షాల వల్ల మునిగిన పొలాలను చూసి, నష్టాలపై జిల్లా అధికారులతో సమీక్షించాల్సిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పర్యటనను అర్ధాంతంగా ముగించుకుని వెళ్లిపోయారు. నష్టాన్ని చూడకుండానే.. ఏ రైతునూ పరామర్శించకుండానే.. అధికారుల నుంచి వివరాలు తెలుసుకోకుండానే నరసాపురం మండలం పెదమైనవానిలంకలోని హెలిప్యాడ్ నుంచే వెనుదిరిగారు. షెడ్యూల్ ప్రకారం నరసాపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గురువారం పర్యటించాల్సి ఉంది. ఆయన వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేకపోగా లక్షల రూపాయలు వృథాగా ఖర్చయ్యూరుు. అధికారులు, సిబ్బంది శ్రమ కూడా వృథా అరుు్యంది.
బయల్దేరడమే లేటు
తూర్పుగోదావరి జిల్లా పర్యటన పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామానికి చేరుకోవాల్సి ఉంది. ఉదయం హైదరాబాద్‌లోనే రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరిన ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లాకు ఆలస్యంగా చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకూ అక్కడే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత 4.30 గంటలకు పెదమైనవానిలంక చేరుకున్నారు. హెలికాప్టర్ నుంచి సీఎం దిగిన వెంటనే వాతావరణం బాగోలేదని, వెంటనే వెళ్లకపోతే ఇబ్బందని పైలట్ చెప్పడంతో సీఎం హెలికాప్టర్ ఎక్కేశారు. దీంతో ఉదయం నుంచి పడిగాపులు పడిన అధికారులు, సిబ్బంది నీరుగారిపోయారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పెదమైనవానిలంకలో సముద్రం కోతకు గురైన ప్రాంతాన్ని చూసి నష్టపోయిన గ్రామస్తులు, మత్స్యకారులతో సీఎం మాట్లాడాల్సి ఉంది. కానీ ఆయన వచ్చీరాగానే వెళ్లిపోవడంతో ఆ కార్యక్రమాలేవీ జరగలేదు. ఇందుకోసం మూడురోజుల నుంచి అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌తోపాటు పలువురు జిల్లా అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ సీఎం కోసం అక్కడే మకాం వేశారు. చివరకు వారంతా నీరసంతో వెనక్కు వచ్చేశారు.
రోజంతా పడిగాపులే
మరోవైపు సీఎం కోసం తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్ కళాశాలలో చేసిన భారీ ఏర్పాట్లు కూడా వృథా అయ్యాయి. ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశం కోసం ఉదయం నుంచే అధికారులు సిద్ధమయ్యారు. అన్ని శాఖల అధికారులు సాయంత్రం వరకూ అక్కడే ఉన్నారు. చివరకు సీఎం రాకపోవడంతో వారి సమయమంతా వృథా అరుు్యంది. సీఎం పర్యటన లేకపోతే ముంపు ప్రాంతాల్లో వారు చేపట్టిన పునరావాస కార్యక్రమాలు, మరమ్మతులు తదితర పనుల్లో నిమగ్నమై ఉండేవారు.
సొమ్ము.. శ్రమ వృథా
సీఎం పర్యటన కోసం ఖర్చు చేసిన సుమారు రూ.20 లక్షలు బూడిదలో పోసిన పన్నీరైంది. హెలిప్యాడ్‌ల నిర్మాణం, రోడ్లకు మరమ్మతులు, వందలాది మందికి భోజనాలు, టీఏ, డీఏలు, వాహనాలు, వాటికి కావాల్సిన అయిల్‌తోపాటు ఇతర ఖర్చులన్నీ కలిపి రూ.20 లక్షలపైనే అరుు ఉంటుందని అధికారుల ద్వారా తెలిసింది. జి ల్లా అధికారులు, వారి సిబ్బంది రావడానికి భా రీ స్థాయిలో వాహనాలు సమకూర్చుకున్నారు. బందోబస్తు కోసం 605 మంది పోలీసులు పని చేశారు. వారికి భోజనాలు, వాహన సదుపా యం, టీఏ, డీఏ అంతా నష్టమే. వారి శ్రమ కూ డా వృథా అయింది. ఇదంతా సీఎం చలవేనని అధికారులు గుసగుసలాడుకోవడం కనిపించింది.
ప్రజల్ని సముదారుుంచేందుకు తంటాలు
నరసాపురం రూరల్, న్యూస్‌లైన్ : పెదమైనవానిలంక గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెలిప్యాడ్ నుంచే తిరుగు ప్రయూణం కావడంతో ఆయన కోసం ఎదురుచూసిన రైతులు, ప్రజలు నిరాశకు గురయ్యూరు. దీంతో ఎంపీ కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, కలెక్టర్ సిద్ధార్థజైన్ అక్కడ వేచివున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వాతావరణ పరిస్థితులు, సమయం అనుకూలంగా లేకపోవడంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సభాస్థలికి రాలేకపోయారని ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. ప్రతికూల పరిస్థితుల వల్ల హెలికాప్టర్‌ను గ్రామంలో దింపడానికి కూడా పైలట్ అంగీకరించలేదని, ఒక్కసారి గ్రామస్తులకు కనిపించి వెళ్లిపోదామని సీఎం బలవంతం చేసి హెలిప్యాడ్ వరకూ వచ్చారని చెప్పారు. శుక్రవారం ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం కావడం వల్ల హైదరాబాద్‌కు వెళ్లిపోవాల్సి వస్తోందని, లేదంటా ఈ రాత్రి పెదమైనవానిలంక గ్రామంలోనే బస చేసేవాడినని కిరణ్‌కుమార్‌రెడ్డి తమకు చెప్పారన్నారు. ఈ విషయూలను రైతులకు, మత్స్యకారులకు తమను చెప్పమన్నారంటూ అక్కడి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. త్వరలోనే సీఎం వస్తారని చెప్పుకొచ్చారు.
నష్టాలపై సీఎంకు నివేదిక
పంటలు, ఆస్తి నష్టం రూ.808.18 కోట్లుగా అంచనా
ఏలూరు/నరసాపురం రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో అక్టోబర్ 22 నుంచి 27వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో పంటలు, ఆస్తులకు రూ.808.18 కోట్ల మేర నష్టం సంభవించిందని కలెక్టర్ సిద్ధార్థజైన్ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. నరసాపురం మండలం పెదమైనివానిలంక గ్రామానికి వచ్చి, వెనుదిరిగిన ముఖ్యమంత్రికి నష్టాలపై కలెక్టర్ నివేదిక అందించారు. జిల్లాలో 59 వేల 45 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని, దీని విలువ రూ.150 కోట్లు ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. 2,453 హెక్టార్లలో ఉద్యాన పంటలకు వాటిల్లిన నష్టం విలువ రూ.41.88 కోట్లు అని వివరించారు.
41 హెక్టార్లలో రూ.5 లక్షల విలువైన పట్టు పురుగుల పెంపకానికి, 9.05 హెక్టార్ల చెరువుల్లో రూ.96 లక్షల విలువైన చేపల నష్టం సంభవించినట్టు వివరించారు. 768.10 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రహదారులు ధ్వంసం కావడంతో రూ.370 కోట్ల 86 లక్షలు, 1139.78 కిలోమీటర్లు పంచాయతీ రోడ్లు దెబ్బతినగా రూ.214.8 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. 220 కిలోమీటర్ల మునిసిపల్ రహదారులకు రూ.23.66 కోట్ల మేర నష్టం జరిగిందని పేర్కొన్నారు. రూ.53 లక్షల విలువైన 358 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు దె బ్బతిన్నాయన్నారు.
8 నీటిపారుదల వనరులు దెబ్బతినటంతో రూ.29 లక్షల నష్టం సంభవించిందన్నారు. జిల్లాలో 1,945 ఇళ్లు దెబ్బతిన్నాయని, భారీ వర్షాల కారణంగా నలుగురు మృతి చెందారని వివరించారు. ముంపు బాధితుల కోసం 21 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1,054 మందిని ఆదుకున్నామన్నారు. 66 వైద్య శిబిరాలు నిర్వహించి సేవలందించామని పేర్కొన్నారు. భారీ వర్షాలకు రూ.5 లక్షల విలువైన 25 పశువులు మృత్యువాత పడ్డాయని సీఎంకు ఇచ్చిన నివేదికలో వెల్లడించారు.
Advertisement
Advertisement