
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో సొంత గూటికి చేరారు. కిరణ్‌కు రాహుల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏఐసీసీ కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా, ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఊమెన్ చాందీ, పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రులు జేడీ శీలం, పల్లంరాజులతో కలసి కిరణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీతో నాబంధం విడదీయలేనిది. రాజకీయంగా నాకు లభించిన గుర్తింపు, పదవులు కాంగ్రెస్ పుణ్యమే. మధ్యలో కొన్ని జరిగాయి. జరిగిన దానికంటే ఇక జరగాల్సిందే ముఖ్యం. అందుకే ఒక సామాన్య కార్యకర్తలా మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతున్నా.
అధిష్టానం ఇచ్చే బాధ్యతలు నిర్వర్తిస్తాŠ’’ అని కిరణ్ చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే ఏపీ, తెలంగాణలకు ఇచ్చిన హామీలు అమలవుతాయని అన్నారు. ఇక తన సోదరుడు టీడీపీలో చేరడంపై మీడియా ప్రశ్నించగా.. టీడీపీలో చేరవద్దని తన తమ్ముడికి చెప్పానని, అయితే వ్యక్తిగత నిర్ణయంతో ఆయన టీడీపీలో చేరినట్టు కిరణ్ సమాధానం ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన కాంగ్రెస్‌ను వీడి జైసమైక్యాంధ్ర పార్టీ పెట్టుకున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరగవడమే కాకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కిరణ్ చేరికతో కాంగ్రెస్‌కు బలం చేకూరిందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఊమెన్ చాందీ అన్నారు. ‘భావోద్వేగంతో కాంగ్రెస్‌ను వీడిన నా మిత్రుడు కిరణ్‌కుమార్‌రెడ్డికి తిరిగి పార్టీలోకి ఇదే నా స్వాగతం’ అని రఘువీరారెడ్డి అన్నారు.
కిరణ్ చేరికపై కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి
కిరణ్‌కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆ పార్టీలోని సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. రాహుల్ సమక్షంలో కిరణ్ తిరిగి పార్టీలో చేరే కార్యక్రమానికి కాంగ్రెస్‌లోని కీలకమైన నేతలు దూరంగా ఉన్నారు. రఘువీరా, జేడీ శీలం, పల్లంరాజు మినహా ఇతర నేతలెవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. కిరణ్‌కు అత్యంత సన్నిహితులుగా మెలిగిన కాంగ్రెస్ పార్టీలోని మాజీ మంత్రులెవరూ కూడా హాజరుకాకపోవడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల పదవులు అనుభవించి చివరికి పార్టీకే తీరని ద్రోహం చేసిన కిరణ్‌ను తిరిగి పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ పలువురు నేతలు బాహటంగానే విమర్శిస్తున్నారు. ఒకవేళ ఆయన్ను పార్టీలో చేర్చుకోవాలనుకుంటే ఆయనతో క్షమాపణలు చెప్పించాలని కొంతమంది నేతలు డిమాండ్ చేశారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ‘కిరణ్‌కుమార్ రెడ్డి సీఎం పదవిలో చివరి వరకు ఉండి పార్టీకి వెన్నుపోటు పొడిచి పోయాడు’ అని కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఏఐసీసీలో మీడియా సమావేశంలో, ఆ తరువాత కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు ముభావంగా ఉండటం, కిరణ్‌కుమార్ రెడ్డితో అంటీముట్టనట్టు వ్యవహరించడం వారిలో ఉన్న అసంతృప్తిని వ్యక్తపరుస్తోందని ఏఐసీసీలో చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment