
'తెలంగాణను అడ్డుకునే వ్యక్తులపై తిరుగుబాటు'
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును ఆపుదామనే ప్రయత్నంలోనే తన శాఖ మార్చారని మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగదన్నారు. తెలంగాణను అడ్డుకునే వ్యవస్థలు, వ్యక్తులపై తిరుగుబాటు కొనసాగుతుందన్నారు. తాను పదవులు కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నందునే మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు. బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకునేందుకు ఇదంతా చేశారన్నారు. ఇది మూమ్మాటికీ అధికార దుర్వినియోగమే అన్నారు. తన రాజీనామాతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, సీమాంధ్ర నేతలకు కనువిప్పు కలగాలన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారి ముందు తన రాజీనామా చాలా చిన్నదన్నారు.