అక్కినేని నాగేశ్వరరావును చివరిసారిగా చూడలేకపోయానన్న బాధ తనకు జీవితాంతం మిగిలిపోతుందని సీనియర్ నటుడు మురళీ మోహన్ అన్నారు.
హైదరాబాద్ : అక్కినేని నాగేశ్వరరావును చివరిసారిగా చూడలేకపోయానన్న బాధ తనకు జీవితాంతం మిగిలిపోతుందని సీనియర్ నటుడు మురళీ మోహన్ అన్నారు. వారం రోజుల క్రితం ఆయనను చూసేందుకు వెళదామనుకున్నానని, అయితే అక్కినేని నీరసంగా ఉండటంతో వాయిదా పడిందన్నారు. ఆ తర్వాత తాను అనుకోకుండా రాజమండ్రి వెళ్లాల్సి ఉండటంతో అక్కినేనిని కలుసుకోలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎన్నార్తో ఆత్మీయ అనుబంధం ఉందని, ఆయన మరణంతో తాను కుటుంబ పెద్దను పోగొట్టుకున్నంత బాధగా ఉందని మురళీ మోహన్ అన్నారు.
అక్కినేని వందేళ్లు బతకాలని తాను అన్నప్పుడల్లా.... ఎన్నేళ్లు బ్రతికామన్నది కాదని... ఎంత ఆరోగ్యంగా బతికామన్నదే ముఖ్యమనేవారని... ఆ స్మృతులను మురళీమోహన్ ఈ సందర్భంగా తలుచుకున్నారు. తనకు క్యాన్సర్ సోకిందని ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పిన గుండె ధైర్యం ఉన్న మనిషి అని.... అనంతరం ఆపరేషన్ చేయించుకున్నారని, మరో రెండు మూడేళ్లు ఆరోగ్యంగా ఉంటారనుకున్నానని... ఇంతలోనే ఆయనకు మరణం ముంచుకు వచ్చిందని అన్నారు.