అక్కినేని లేరనేది నమ్మలేని నిజమని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్స్ అధినేత , దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
హైదరాబాద్ : అక్కినేని లేరనేది నమ్మలేని నిజమని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్స్ అధినేత , దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆయన బుధవారం ఉదయం ఏఎన్నార్ భౌతికకాయన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అక్కినేనితో తన అనుబంధం విడదీయలేనిదన్నారు. ఆయనతో కలిసి తాను 14 సినిమాలు చేసానన్నారు. తామిద్దరం ఒక కంచం ....ఒకే మంచం అనేలా ఉండేవారిమని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నాటికి...నేటికీ అక్కినేని అందరికి ఆదర్శమని ఆయన అన్నారు.
ప్రముఖ నిర్మాత రామానాయుడు మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో మహా వృక్షం రాలిపోయిందన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ చిత్రపరిశ్రమకు రెండు పిల్లర్లుగా ఉండేవారని అన్నారు. అక్కినేనితో తాను తీసిన 'ప్రేమ్ నగర్' చిత్రం తన జీవితంలో ఓ శక్తిలా మారిందన్నారు. ఆ సినిమాతో అప్పటివరకూ తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులను తట్టుకున్నట్లు చెప్పారు. అక్కినేని కుటుంబంతో బంధుత్వం ఉండని... ఆయన మరణం బాధాకరమని రామానాయుడు అన్నారు. నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ అక్కినేని లేరనే వార్త జీర్ణించుకోలేనిదన్నారు. ఆయనతో కలిసి రెండు సినిమాలు చేసినట్లు తెలిపారు.