కేఎల్‌యూలో సరికొత్త ఎంబీఏ కోర్సు
విజయవాడ: బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో విశ్లేషణాత్మక ఆలోచనలను పెంపొందించే లక్ష్యంతో సరికొత్త ప్రోగ్రామ్ పంపిణీ తరహా ఎంబీఏ కోర్సులను దేశంలోనే తొలిసారిగా కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంబీఏ విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచనలతో పాటు, సాంస్కృతిక అవగాహన పెంచేందుకు, వ్యాపార సరళిని లోతుగా అధ్యయనం చేసే లక్ష్యంతో కేఎల్‌యూ, టైమ్స్ ప్రో సంస్థ సంయుక్తగా ఎంబీఏ బ్యాంకింగ్, ఫైనాన్స్ విభాగాల్లో రెండేళ్ల పంపిణీ తరహా కోర్సులను ప్రారంభించనున్నాయి.
ఈ మేరకు విజయవాడ నగరంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కేఎల్‌యూ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, టైమ్స్‌ప్రో అధ్యక్షుడు దీపక్ లంబా పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ ఎంబీఏ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉత్తమ ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు రిటైల్ బ్యాంకింగ్, విదేశీ మారకం, ఫైనాన్షియల్, కార్పొరేట్ బ్యాంకింగ్ వంటి కీలక అంశాలపై విద్యార్థులకు పరిపూర్ణమైన విజ్ఞాణాన్ని అందించాలనే లక్ష్యంతో దేశంలోనే మొదటి సారిగా పంపిణీ తరహా ఎంబీఏ కోర్సును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఈ రెండు సంస్థల్లోనూ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, రెండు సర్టిఫికెట్లు ఇవ్వడాన్నే పంపిణీ తరహాగా పేర్కొన్నారు. టైమ్‌ప్రో అధ్యక్షులు దీపక్ లంబా మాట్లాడుతూ విద్యార్థులను పరిశ్రమలతో అనుసంధానం చేసి, ప్రాక్టికల్ పరిజ్ఞానంతో కోర్సు బోధిస్తామని తెలిపారు. సమావేశంలో కేఎల్‌యూ ఉపాధ్యక్షులు రాజా హరీన్, వైస్‌ఛాన్సలర్ ఎల్‌ఎస్‌ఎస్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఆనందకుమార్ తదితరులు పాల్గొన్నారు.