
రికార్డుల కోసం పవిత్ర కార్యం అపవిత్రం
► అవినీతిలో కోడెల కుటుంబానికే గిన్నీస్ రికార్డు
► ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
► అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే అవయవదానం
► దరఖాస్తు చేసిన వారందరితో ఒకసారి రక్తదానం చేయించండి
► ఏపీ స్పీకర్‌పైనే అత్యధిక కేసులు
నరసరావుపేట: చాలా పవిత్రమైన అవయవదానం కార్యక్రమాన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కోసం అపవిత్రం చేశారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘాటుగా విమర్శించారు. తన కుమారుడు, కుమార్తె చేస్తున్న అవినీతిపై ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ కార్యక్రమం చేపట్టారని, అవినీతిలో పోటీ పెడితే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించేది స్పీకర్ కోడెల కుటుంబమే అన్నారు. అవయవాలు ఇచ్చేందుకు దరఖాస్తు చేసిన వారందరితో ఒకసారి రక్తదానం చేయిస్తే నిజంగా విజయవంతం అయినట్టుగా భావించవచ్చన్నారు.
పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవయవదానం అనేది ఒక ప్రైవేటు కార్యక్రమమని, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, ప్రభుత్వ అధికారులైన డీఆర్‌డీఎ పీడీ, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లు ఏవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే తన పుట్టినరోజును నామమాత్రంగా జరుపుకొంటే స్పీకర్ అత్యుత్సాహంతో వ్యవహరించారన్నారు.
ముందుగానే 250 కట్టల దరఖాస్తులు నమోదుచేసుకుని వచ్చి, అక్కడకు వచ్చిన వారికి కంకళాలు(ట్యాగ్) కట్టి విజయవంతమైందని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు. వాస్తవానికి అక్కడకు వచ్చిన వారు వేరు, సంతకాలు చేసిన వారు వేరన్నారు. సంతకాలు చేసినవారెవరూ అక్కడకు రాలేదన్నారు.
ఏపీ స్పీకర్‌పైనే అత్యధిక కేసులు
దేశంలో ప్రస్తుతం అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న స్పీకర్ ఆంధ్రప్రదేశ్ స్పీకరే అని అన్నారు. ఆయనపై 22 క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా స్వయంగా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారన్నారు. ఇది నిజంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాల్సిందేనని ఎద్దేవా చేశారు. పోలీసులు న్యాయబద్ధంగా స్పీకర్ కుమారుడు, కుమార్తెలపై కేసులు పెట్టడం ప్రారంభిస్తే ఈ పాటికి వారు కూడా గిన్నీస్‌బుక్‌లోకి ఎక్కేవారన్నారు.
జగన్ దీక్షతోనే రైతులకు మద్దతు ధర
మిర్చి రైతులకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన రైతుదీక్ష తర్వాతే కేంద్రం మిర్చి రైతుకు మద్దతు ధర ప్రకటించిందని ఎమ్మెల్యే గోపిరెడ్డి చెప్పారు. దీక్ష విరమించిన 24 గంటల్లోనే మిర్చి క్వింటాలుకు రూ.5వేలు మద్దతు ధరతోపాటు ట్రాన్స్‌పోర్డు చార్జీల కింద రూ.1250 ప్రకటించిందన్నారు.
సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు షేక్ ఖాజావలి మాస్టారు, జిల్లా అధికార ప్రతినిది పిల్లి ఓబుల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, నరసరావుపేట మండల అద్యక్షుడు కొమ్మనబోయిన శంకరయాదవ్, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాదర్‌బాషా, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ సైదావలి, కౌన్సిలర్ మాడిశెట్టి మోహనరావు పాల్గొన్నారు.