కొమురం భీమ్ వర్ధంతిని ప్రభుత్వం గుర్తించిందని, ఇకపై ఈ కార్యక్రమాన్ని కొమురం భీమ్ ఫెస్టివల్ (పండుగ)గా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ పేర్కొన్నారు.
ఉట్నూర్, న్యూస్‌లైన్ :
కొమురం భీమ్ వర్ధంతిని ప్రభుత్వం గుర్తించిందని, ఇకపై ఈ కార్యక్రమాన్ని కొమురం భీమ్ ఫెస్టివల్ (పండుగ)గా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ పేర్కొన్నారు. జిల్లాలో రెండు వేడుకలను ప్రభుత్వం గుర్తించిందని, వీటిలో కేస్లాపూర్‌లోని నాగోబా జాతరను గిరిజన ఉత్సవంగా, కొమురం భీమ్ వర్ధంతిని ఫెస్టివల్‌గా నిర్వహించాలని నిర్ణరుుంచిందని తెలిపారు. ఈ నెల 18న జోడెఘాట్‌లో తలపెట్టిన 73వ కొమురం భీమ్ ఫెస్టివల్ నిర్వహణపై కేబీ ప్రాంగణంలోని పీఎమ్మార్సీ సమావేశ మందిరంలో గురువారం అధికారులు, ఆదివాసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. భీమ్ ఫెస్టివల్‌ను రాష్ట్ర పర్యాటకశాఖ సహకారంతో నిర్వహించనున్నట్లు పీవో పేర్కొన్నారు. ఈ వేడుకలకు వచ్చే ఆదివాసీ గిరిజనులు, గిరిజనేతరులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
తాగునీరు, వైద్యం, భోజనం, వసతి సౌకర్యాలు కల్పించడంతోపాటు బెజ్జూర్, వాంకిడి, తిర్యాణి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, భైం సా, నెన్నెల తదితర దూర ప్రాంతాల నుంచి జోడెఘాట్‌కు వచ్చేవారికి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని అన్నారు. గిరిజన దర్బార్ ఏర్పాటు చేసి గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కరిస్తామని చెప్పారు. గతంలోలాగే ప్రభుత్వ స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. నైజాం సర్కార్‌తో కొమురం భీమ్‌తోపాటు పోరాడి అసువులు బాసిన మరో 14 మంది వీరుల చరిత్రను తెలుపుతూ స్తూపం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గిరిజన సంస్కృతిని తెలిపేలా కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పర్యాటక శాఖ సహకారంతో జన్నారం మండలంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయడంతోపాటు పర్యాటక ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. గిరిజన గోండు భాషకు త్వరలో లిపి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆదివాసీ గిరిజన నాయకులు మాట్లాడుతూ జోడెఘాట్‌లోనే భీమ్ పండుగ నిర్వహించాలన్నారు.
భీమ్ నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయూలని, గతేడాది వర్ధంతి సందర్భంగా గిరిజనులు ఇచ్చిన అర్జీలను ఇంత వరకు పరిష్కరించలేదని తెలిపారు. ఇకనైనా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కొమురం భీమ్ వారసులకు భూమి పంపిణీ చేసి వారి ఆర్థిక ఎదుగుదలకు ఐటీడీఏ చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని గిరిజన చారిత్రక ఆధారాలు, ప్రాంతాలను పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేయూలని, స్థానిక గిరిజనులకు శిక్షణ ఇచ్చి వారినే గైడ్‌లుగా ఐటీడీఏ నియమించాలని పేర్కొన్నారు. ఆర్డీవో రామచంద్రయ్య, ఇన్‌చార్జి ఏపీవో(జనరల్) భీమ్, రిటైర్డ్ ఏపీవో(జనరల్) వెంకటేశ్వర్లు, ఈఈటీడబ్ల్యూ శంకరయ్య, ఏజెన్సీ వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి, డీఏంవో అల్హం రవి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఇంద్రసేన్, ఆదివాసీ గిరిజన నాయకులు మాడావి రాజు, సిడాం భీంరావు, సిడాం శంభు, సిడాం అర్జు, సెడ్మా కి సీతారాం, సిడాం రాంకిషన్, దాసం విజయ, కనుక లక్కే రావు, కనక యాదవ్‌రావు, బొజ్జు పాల్గొన్నారు.