మరో ఏడు నెలల్లో కృష్ణా పుష్కరాలు
అధ్వానంగా ఉన్న ఆర్ అండ్ బి రహదారులు
రూ. 500 కోట్ల మంజూరుకు ప్రతిపాదనలు
నిధుల కోసం అధికారుల ఎదురుచూపులు
విజయవాడ : మరో ఏడు నెలల్లో కృష్ణా పుష్కరాలు మొదలుకానున్నాయి. కోట్లాదిమంది యాత్రికులు పుణ్యస్నానాలాచరించేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలివస్తారు. వేలాది వాహనాల రాకతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దీనికితోడు కృష్ణా తీరం వెంబడి ఉన్న రహదారులన్నీ గోతులమయంగా మారడంతో ప్రయాణికులు యాతన పడే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో జిల్లాలోని ఆర్ అండ్ బి రోడ్లకు పుష్కరాలనాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలి. రోడ్ల అభివృద్ధికి ఆ శాఖ అధికారులు అంచనాలైతే సిద్ధం చేశారు కాని అక్కడ్నుంచి మరో అడుగు ముందుకు పడలేదు. జిల్లాలో ఆర్ అండ్ బి శాఖ పరిధిలో వేల కిలోమీటర్ల రహదారులున్నాయి. ప్రధానంగా జగ్గయ్యపేట నుంచి హంసలదీవి వరకు ఉన్న కృష్ణా తీరంలో దాదాపు 800 కి.మీ. మేర రహదారులు విస్తరించాయి. ప్రధాన రహదారులతోపాటు అనేక సర్వీసు రోడ్లు, గ్రామాల్లో ఉన్న ప్రధాన రహదారులన్నీ ఆర్ అండ్ బి పరిధిలోనే ఉన్నాయి.
పుష్కరాలను సమర్ధంగా నిర్వహించాలని కలెక్టర్ గత నెలలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందే జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా కూడా సమీక్ష నిర్వహించారు. ఎక్కడా నిధుల కొరత లేదని, అన్ని శాఖల అధికారులు అవసరమైన ప్రతిపాదనలు పంపితే ప్రత్యేకంగా ఆయా శాఖల నుంచి నిధులు మంజూరుచేయిస్తామని ప్రకటిం చారు. ఇది జరిగి కూడా రెండు నెలలు దాటింది. మళ్లీ మంత్రి వాటి గురించి కనీసం వాకబు కూడా చేసిన దాఖ లాలు లేవు. మరోవైపు దుర్గగుడి వద్ద కనకదుర ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్‌సహా జిల్లా ఉన్నతాధికారులంతా ఆ పనులపైనే దృష్టిసారించి మిగిలిన పనులను మరిచిపోయారు. అన్ని ప్రభుత్వ శాఖల్లానే ఆర్ అండ్ బి అధికారులు కూడా భారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసి గత నెలలో ఆమోదం కోసం పంపి కాసుల కోసం నిరీక్షిస్తున్నారు.
60 రహదారులకు మరమ్మతులు
జిల్లాలో 2800 కిలోమీటర్ల పొడవున ఆర్ అండ్ బి రహదారులున్నాయి. అన్ని గ్రామాలను కలుపుతూ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఇవి ఉన్నాయి. వీటికి ఏటా సాధారణ మరమ్మతులు జిల్లాలో నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు కావడంతో ప్రభుత్వం దీనికి కొంత ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే జిల్లాలోని ఆర్ అండ్ బి రహదారులకు మరమ్మతులు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి పుష్కరఘాట్‌లను ప్రామాణికంగా తీసుకొని ఘాట్లకు అనుసంధానంగా ఉన్న రోడ్లను అధికారులు గత నెలలో పరిశీలించారు. దీనికి అనుగుణంగా అవసరమైన చోట నిర్వహించాల్సిన పనులను కూడా గుర్తించారు. ప్రాథమికంగా జగ్గయ్యపేటలోని వేదాద్రి నుంచి అవనిగడ్డ సమీపంలోని హంసలదీవి వరకు 90 ప్రధాన ఘాట్లు ఉన్నాయి. 60 ప్రధాన రహదారులకు మరమ్మతులు చేయడం, కొన్ని చోట్ల ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు వీలుగా రహదారుల విస్తరణ పనులు నిర్వహిం చాల్సి ఉంది. వీటికి సుమారు రూ. 500 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు వేసి 60 రహదారుల పనులను ఆమోదించాలని ప్రతిపాదనలు పంపారు.
ముఖ్యంగా మైలవరం, తిరువూరు రోడ్డు, నూజివీడు రోడ్డు, యనమలకుదురు నుంచి చల్లపల్లి వరకు ఉన్న కరకట్ట మార్గం, గుడివాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న మార్గం, హైదరాబాద్ నుంచి తెలంగాణ ప్రాంతాల వాహనాల రద్దీ నియంత్రణకు జగ్గయ్యపేట నియోజకవర్గంలోని కీలక ఆర్ అండ్ బి రహదారులను అభివృద్ధి చేయడం, దాదాపు 15 చోట్ల రోడ్లను విస్తరించడం వంటి పనులు పూర్తిచేయాలి. పుష్కరాలకు సమయం దగ్గర పడుతున్నా ప్రభుత్వం మాత్రం నిధుల మంజూరు విషయంపై దృష్టి సారించడంలేదు.
కాసులు కావాలి
Published Tue, Jan 19 2016 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM
Advertisement
Advertisement