
ఏపీ సీఎంపై వ్యాఖ్యలు తగదు: కేఈ
హైదరాబాద్: 'ఓటుకు నోటు' వ్యవహారంలో తమ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలు చేయడం తగదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ముడుపుల కేసులో అరెస్టైన తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గంటలో సంచలన వార్త వింటారని రేవంత్ రెడ్డి అరెస్ట్ ముందు విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేల కొనుగోలులో ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని నాయిని నర్సింహారెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు ఒక్కొక్కరికీ రూ.5 కోట్లు ఆఫర్ ఇచ్చారని, అందులో భాగంగానే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌తో చంద్రబాబు నేరుగా ఫోన్‌లో మాట్లాడారని, అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని నాయిని వెల్లడించారు.