యాచారం, న్యూస్‌లైన్ : మండల పరిధిలోని కుర్మిద్దలో మళ్లీ ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయల సంస్థ) అలజడి ప్రారంభమైంది. భూ సేకరణ నిమిత్తం అధికారులు గ్రామంలోకి వస్తుండడంతో రైతుల్లో భయాందోళన మొదలైంది. ఏడాది క్రితం పలు సర్వేనంబర్లలో వెయ్యి ఎకరాలకు పైగా భూముల్లో ఏపీఐఐసీ పారిశ్రామిక వాడ ను నెలకొల్పేందుకు నిర్ణయించింది. అప్పట్లోనే స్థానికులు ఆందోళనలకు దిగారు. కొన్నేళ్లుగా ఆ భూములను సాగుచేసుకొని జీవనోపాధి పొందుతున్నామని మంత్రులు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేశారు. రైతులకు పలు రాజకీయ పక్షాల నాయకుల మద్దతు ప్రకటించారు. దీంతో ఇక తమ భూములకు వచ్చిన ముప్పేమీ లేదని రైతులు ఊపిరిపీల్చుకున్నారు. కొద్ది రోజులుగా భూసేకరణ విభాగం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సంధ్యారాణి, మరి కొంతమంది అధికారులు తరుచూ గ్రామంలో భూముల పరిశీలనకు వస్తుండడంతో మళ్లీ ఆందోళన మొదలైంది.
జీవనోపాధి కోల్పోనున్న వందలాది రైతులు..
కుర్మిద్దలో ఏపీఐఐసీ భూములను తీసుకోవడానికి నిర్ణయిస్తే వందలాది మంది హరిజన, గిరిజనులు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఏపీఐఐసీ తీసుకోవాలని నిర్ణయించిన 271 నుంచి 288 సర్వే నంబర్లలో పట్టా భూమి 500 ఎకరాలు, 311, 264, 292 సర్వే నంబర్లలో 485 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. 20 ఏళ్ల క్రితం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం అసైన్డ్ పట్టాలిచ్చింది. దాదాపు 370 ఎకరాల్లో 150 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. మరో 110 ఎకరాల భూమి గుట్టలు, రాళ్లతో కూడి ఉండడంతో వ్యవసాయానికి యోగ్యంగా లేదు. ఈ భూమిని రైతులు పశువులు, గొర్రెలు, మేకలను మేపుకోవడానికి వాడుకుంటున్నారు. 80 ఏళ్లుగా ఈ భూములను నమ్ముకొని జీవనోపాధి పొందుతున్నారు.
రెండు గిరిజనతండాలు మాయం...
కుర్మిద్ద అనుబంధ గిరిజన గ్రామాలైన కుర్మిద్ద తండా, మర్లకుంట తండాలు 311 సర్వే నంబర్‌లో ఉన్నాయి. ఏపీఐఐసీ పారిశ్రామిక వాడ నెలకొల్పాలని నిర్ణయిస్తే ఈ రెండు తండాలు మాయం కావడంతో పాటు దాదాపు 800 కుటుంబాల వరకు వీధిన పడతాయి. భూముల దగ్గరకు వస్తే తీవ్ర ప్రతి ఘటన తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ విజయలక్ష్మిని ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా భూ సేకరణ నిమిత్తం అధికారులు వస్తున్నది వాస్తవమేనని అన్నారు.
కంటికి కునుకులేదు...
ప్రభుత్వం సర్టిఫికెట్లు పంపిణీ చేయకముందు నుంచి యాభై ఏళ్లుగా ఈ భూములను సాగుచేసుకొని జీవనోపాధి పొందుతున్నాం. ఇప్పుడొ చ్చి భూములు లాక్కొంటారని అంటున్నారు.ఆరు ఎకరాల భూమి పోయే అవకాశం ఉంది. కంటికి కునుకు లేకుండా పోయింది.
-జంగిలి అంజయ్య
ప్రాణాలైనా వదులుతాం
నాది ఐదెకరాల భూమి పోయే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటామంటే ఊరుకునేది లేదు. ఆ ఆలోచనను వెంటనే విరమించుకోవాలి. ప్రాణాలు పణంగా పెట్టయినా భూములను అడ్డుకుంటాం.
- పంది బాలయ్య
భూమిపోతే చావే దిక్కు..
తండాలో ఐదుగురం అన్నదమ్ములకు పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. కొన్నేళ్లుగా సాగు చేసుకొని జీవనోపాధి పొందుతున్నాం. వ్యవసాయం తప్పితే మాకు మరే పని రాదు. భూమి లాక్కుంటే మాకు చావే దిక్కవుతుంది.
- నేనావత్ సేవ్యా
నిర్ణయాన్ని విరమించుకోవాలి..
భూములను ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరు. అలాంటప్పుడు ప్రభుత్వం నిర్ణయాన్ని విరమించుకోవాలి. రైతుల అంగీకారం లేనిది భూములు తీసుకోవద్దు. భూములు కోల్పోవడం వల్ల హరిజన, గిరిజన రైతులు జీవనోపాధి కోల్పోయి వీధిన పడతారు.
- విజయ, సర్పంచ్, కుర్మిద్ద
మళ్లీ భూసేకరణ భయం
Published Sat, Dec 21 2013 12:37 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement