హైదరాబాద్:ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా విడుదల చేసిన డీఎస్సీ-2014 నోటీఫికేషన్ షెడ్యూల్ అస్పష్టంగా ఉంది. డీఎస్సీతో పాటు టెట్ పరీక్షను కూడా ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. తాజా డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ తో గతంలో టెట్ అర్హులైన వారు కూడా మరోసారి పరీక్ష రాయాల్సి ఉండటంతో గందరగోళానికి తావిస్తోంది. అయితే టెట్ పరీక్షల్లో వెయిటేజీ ఆధారంగానే డీఎస్సీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా డీఎస్సీ-2014 నోటీఫికేషన్ షెడ్యూల్ను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారమిక్కడ విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్ 1,848, లాంగ్వేజ్ పండిట్స్ 812, పీఈటీ 156, ఎస్జీటీ 6,244 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించనుంది. డీఎస్సీ పరీక్షలు, ఎస్జీటీలకు మే 9న, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలకు మే 10, స్కూల్ అసిస్టెంట్లకు మే 11న పరీక్షలు జరగనున్నాయి. డిసెంబర్ 2 నుంచి జనవరి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏపీ ఆన్లైన్, మీ-సేవా కేంద్రాల ద్వారా ఫీజు చెల్లింపుకు అవకాశం ఉంది.