నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ తాత్కాలికంగా వాయిదా పడింది.
హైదరాబాద్ : నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారమిక్కడ తెలిపారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. 2010 వరకు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చిందని గంటా పేర్కొన్నారు. 2016వరకూ ఆ గడువు పెంచామని ఎన్సీపీఈకి లేఖ రాశామన్నారు. కేంద్రం అనుమతి ఇస్తే బీఈడీ విద్యార్థులకు ఎస్‌జీటీ రాసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. కేంద్రం నుంచి సమాధానం వచ్చాకే నోటిఫికేషన్పై నిర్ణయం తీసుకుంటామన్నారు.
కాగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజు డీఎస్సీ ప్రకటన వస్తుందని నిరుద్యోగులంతా ఎంతో ఆశగా ఎదురు చూశారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రే డీఎస్సీ ప్రకటనపై హామీ ఇవ్వడంతో అంతా నిజమే అనుకున్నారు. తీరా ఈనెల 5న డీఎస్సీ ప్రకటన వెలువడలేదు. ఎప్పటిలాగే ప్రభుత్వం ప్రకటనను వాయిదా వేసింది. దీంతో డీఎస్సీ అభ్యర్థులంతా తీవ్ర నిరాశలో ఉన్నారు.