ఐదు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్
విలేకరులతో మంత్రి గంటా
విశాఖపట్నం (సిరిపురం): బీఈడీ విద్యార్థులకు ఎస్‌జీటీ రాసుకునే అవకాశం కల్పిస్తామని చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సెప్టెంబర్ 5న ఇవ్వాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేయాల్సి వచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీ రాసుకునే అవకాశంపై ముఖ్యమంత్రితో మాట్లాడి నాలుగు, ఐదు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ కచ్చితంగా ఇస్తామన్నారు.
రాజధానికి కావల్సిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నప్పటికీ భౌగోళికంగా పక్కనుండడం వల్లే విజయవాడను రాజధానిగా ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. ఏదేమైనా విశాఖను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నియోజకవర్గాల అభివృద్ధి నిధులు ఇచ్చే అవకాశం లేదని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రకటించారని, అలాంటప్పుడు నియోజకవర్గాల అభివృద్ధి ఎలా సాధ్యమని మంత్రిని ప్రశ్నించగా.. నిధులున్నా లేకపోయినా అభివృద్ధికి మాత్రం ఢోకా లేదని చెప్పుకొచ్చారు.