కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవాలని విజయవాడ ఎంపీ లగడపాటి తెలిపారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఈ మేరకు సీమాంధ్ర నేతలు ఏకం కావాలని ఆయన సూచించారు. తెలంగాణ నోట్ ను ఆమోదించడానికి రాష్ట్ర కాంగ్రెస్ లోని ముఖ్యనేతలే కారణమని లగడపాటి మండిపడ్డారు. సీమాంధ్ర కాంగ్రెస్ మోజార్టీ ఎమ్మెల్యేలు విభజనకు అనుకూలంగా ఉన్నారంటూ ఓ ముఖ్యనేత కర్ణాటకలోని మ్యాండ్యాకు వెళ్లి మరీ నివేదిక ఇచ్చారని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఆగమేఘాలపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలే కారణమన్నారు. కచ్చితంగా రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో కేసువేయాలన్నారు. రాజకీయ పార్టీలన్నీ ఇందుకు సిద్ధం కావాలన్నారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారంటూ రాష్ట్రపతిని కలవాల్సిన అవసరం ఉందన్నారు.
సమాఖ్య సూత్రాలను, రాజ్యాంగ స్ఫూర్తిని ధిక్కరించేలా ఈ చర్య ఉందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నపారని, దీనిపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే అది తప్పనిసరిగా వీగిపోతుందని రాజగోపాల్ అన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని సవాలుచేస్తూ తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు.