మానవ కంప్యూటర్‌ | Lakkozu Sanjeevayya Sharma known As Great Mathematician | Sakshi
Sakshi News home page

మానవ కంప్యూటర్‌

Published Tue, Jun 11 2019 8:22 AM | Last Updated on Tue, Jun 11 2019 8:22 AM

Lakkozu Sanjeevayya Sharma  known As Great Mathematician  - Sakshi

సాక్షి, కడప : కడప జిల్లాకు చెందిన లక్కోజు సంజీవరాయశర్మ గొప్ప గణిత మేధావిగా పేరు గాంచారు. దేశ, విదేశీయుల చేత ప్రశంసలు అందుకున్నారు. ఆయన ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందినవారు. 1907 నవంబర్‌ 28న జన్మించారు. పుట్టుకతోనే చూపులేదు. అంధుడు పుట్టాడని పెంచడం కష్టమని.. గొంతు పిసికి దిబ్బలో పూడ్చేయాలని మంత్రసాని సలహా ఇచ్చింది. మరికొందరు మహిళలు పురిటి బిడ్డ నోట్లో వడ్ల గింజలు వేశారు. అయినా ఆ పసివాడు చావలేదు సరికదా.. చక్కగా ఆరోగ్యంగా ఎదిగాడు. ప్రపంచం ఈర్ష్యపడే స్థాయికి పేరుగాంచారు. 

ఆ రోజులలో బ్రెయిలీ లిపి లేకపోవడంతో సంజీవరాయ శర్మ చదువుకునేందుకు వీలు కాలేదు. అక్క బడికి వెళ్లి వచ్చాక ఇంటి వద్ద పాఠాలను గట్టిగా చదువుతుంటే విని గుర్తు పెట్టుకునేవాడు. అలా ఆయనకు మామూలు పాఠాలతోపాటు గణితం బాగా వచ్చింది. అందులో అపార జ్ఞానం సాధించారు. అతని బాల్య దశలోనే తండ్రి చనిపోయారు. తల్లే పెంచింది.

పల్లెల్లో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు తదితర అంశాలను సంజీవరాయశర్మ క్షణాల్లో చెప్పేవారు. రైతులు ఈ సాయానికి గానూ ఆయనకు అంతో.. ఇంతో డబ్బు ఇచ్చేవారు. ఆ వయసులోనే వయొలిన్‌ పట్ల ఆకర్షితుడై వాయించడం నేర్చుకున్నారు. తర్వాత వయొలిన్‌ వాయించడం జీవితంలో ఒక భాగమైంది. 

గణితంలో ప్రజ్ఞ
సాహిత్యంలో కవులు అవధానాలు చేయడం తెలిసిందే. అంటే 8 మంది వరుసగా ప్రశ్నలు వేస్తుంటే ఆయా అంశాలకు వెంట వెంటనే పద్యాల రూపంలో జవాబు చెప్పాలి. అలాగే గణితంలో కూడా అవధానం ఉంది. లక్కోజు సంజీవరాయ శర్మ గణితంలో అవధానాలు చేయడంలో దిట్టగా మారారు. పుట్టిన తేదీ, సంవత్సరం, ప్రదేశం, సమయం చెప్పగానే ఆయన దానికి సంబంధించిన తిధి, వార, నక్షత్ర, యోగ, కరణాలు చెప్పేసేవారు. దాంతోపాటు క్లుప్తంగా జాతకాన్ని కూడా తెలిపేవారు.

అలా ఆయన దేశమంతటా మొత్తం 6 వేల గణిత అవధానాలు చేశారు. వేలాది మంది కూర్చున్న సభలో నిమిషానికి 20, 30 కష్టమైన లెక్కలకు అడిగిన వెంటనే సమాధానాలు చెప్పేవారు. ప్రశ్న అడగ్గానే వయొలిన్‌ను కొద్దిగా పలికించి వెంటనే సమాధానం చెప్పేవారు. ఈ విద్య ఎలా నేర్చుకున్నావు అని అడిగితే దైవ దత్తంగా వచ్చిందని బదులిచ్చేవారు. ప్రపంచంలోనే గణితం విషయంలో బెంగళూరుకు చెందిన శకుంతలాదేవి కంప్యూటర్‌ను ఓడించిందంటారు. అలాంటి శకుంతలాదేవినే ఓడించిన గొప్ప వ్యక్తి లక్కోజు సంజీవరాయశర్మ. ఎంత పెద్ద లెక్క అడిగినా కూడా క్షణాల్లో బదులిచ్చేవారు. 

గౌరవ పురస్కారాలు
గణితంలో లక్కోజు గొప్పతనం తెలిసి.. దేశమంతటా ఎందరో గొప్పవాళ్లు ఆయన అవధానాలకు వెళ్లేవారు. మరికొందరు పెద్దలు ప్రత్యేకంగా అవధానం చేయించి విని ఆశ్చర్యపోయేవారు. 1959లో నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ ఢిల్లీలో లక్కోజుతో గణిత అవధానాన్ని ఏర్పాటు చేయించి, తిలకించారు. ఆ కార్యక్రమానికి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా హాజరయ్యారు. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ 1996లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. తొలిసారిగా 1928లో గణిత అవధానం చేశారు. 1995 వరకు దేశమంతటా 6 వేల ప్రదర్శనలు ఇచ్చారు. 1928 నవంబర్‌ 15న నంద్యాలలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలో ప్రధాన ఆకర్షణగా నిలిచి వందలాది లెక్కలకు బదులిచ్చారు. 19 ఏళ్ల వయసులోనే వివాహమైంది. అప్పట్లో ఆయన సతీమణి వయసు 9 ఏళ్లు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. 1994 జనవరి 5న ఆమె శ్రీకాళహస్తిలో ఉండగా మరణించారు. సంజీవరాయశర్మ హైదరాబాద్‌లోని కుమారుడి వద్దకు చేరుకున్నారు. 1997 డిసెంబర్‌ 2న కన్నుమూశారు. ప్రపంచం మొత్తాన్ని తన అద్భుతమైన గణిత విద్యతో ఆకట్టుకున్న గొప్ప వ్యక్తి ఇంత వరకు ఈ భూమిపై మరొకరు పుట్టలేదని.. ప్రపంచంలోని గణిత మేధావులంతా ఎంతో ప్రశంసించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement