
ఆ సినిమాలో చంద్రబాబును హీరోగా చూపిస్తే..
హైదరాబాద్: నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో చంద్రబాబును హీరోగా చూపిస్తే న్యాయపోరాటం చేస్తానని లక్ష్మీపార్వతి ప్రకటించారు. తన భర్త జీవిత చరిత్ర ఆధారంగా తీసే సినిమాలో వాస్తవాలు వక్రీకరిస్తే మౌనంగా ఉండబోనని ఆమె స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.
తన తండ్రిపై సినిమా తీస్తానని ఎన్టీఆర్ కుమారుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో తానే నటిస్తానని వెల్లడించారు. అయితే 1995లో టీడీపీలో జరిగిన పరిణామాలను ఎలా చూపిస్తారనే దానిపై లక్ష్మీపార్వతి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సొంత మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మీపార్వతిని విలన్ గా చూపిస్తారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చెప్పారు. ‘నిజ జీవితంలో విలన్ గా వ్యవహరించిన లక్ష్మీపార్వతిని సినిమాలోనూ ప్రతినాయకిగా చూపిస్తారు. ఎన్టీఆర్ ను ప్రజలకు ఆమె దూరం చేశారు. ఈ విషయం అందరికీ తెలుసు’ అని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ గురించి తనకు కూడా కొన్ని విషయాలు తెలియవని, ఆయనపై సినిమా తీయాలంటే మామూలు విషయం కాదని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ గురించి అన్ని విషయాలు తెలుసుకుని సినిమాగా మలుస్తామని చెప్పారు. 1995, ఆగస్టులో ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. సొంత అల్లుడు తనను వెన్నుపోటు పొడిచాడని ఆరోపిస్తూ ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లారు. 72 వయసులో 1996, జనవరిలో ఎన్టీఆర్ కన్నుమూశారు.