రైతులే బలి | Land collecting for market yard with cheap price | Sakshi
Sakshi News home page

రైతులే బలి

Published Mon, Nov 4 2013 1:37 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

Land collecting for market yard with cheap price

 సాక్షి, కర్నూలు: కొత్త మార్కెట్‌యార్డు నిర్మాణం రైతులకు శాపంగా మారుతోంది. ప్రజా ప్రయోజనాలను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. నాయకుల ఆదేశాలే వీరికి వేదవాక్కుగా మారుతున్నాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేని విధంగా సమస్య పరిష్కారానికి అవకాశం ఉన్నా.. ఆ దిశగా ప్రయత్నించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు నగరంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుటనున్న మార్కెట్ యార్డును రద్దీతో పాటు పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగర శివారులోకి మార్పు చేయాలని నిర్ణయించారు. ఇందుకు ప్రభుత్వం  అనుమతివ్వడంతో పనులు ఊపందుకున్నాయి. ఈ నెల 5వ తేదీన భూమి పూజకు రంగం సిద్ధమవుతోంది. ఉల్చాల రోడ్డులోని పెద్దపాడు గ్రామం వద్ద 113 ఎకరాల విస్తీర్ణంలో కొత్త యార్డు నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలోని భూముల ధర రూ.కోట్లలో ఉండగా.. ప్రస్తుతం అతి తక్కువ ధరతో సేకరణకు ప్రయత్నాలు కొనసాగుతుండటాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.

వాస్తవానికి లక్ష్మీపురం గ్రామంలోని సర్వే నంబర్.1లో 100 ఎకరాల సీలింగ్ భూమి మార్కెట్ యార్డు నిర్మాణానికి అనుకూలమని గతంలో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ, ప్రజాప్రతినిధుల జోక్యంతో నిర్మాణం పెద్దపాడు ప్రాంతానికి మారింది. ఈ మేరకు అధికారులు కొత్త యార్డు నిర్మాణంలో భాగంగా భూ సేకరణకు ఉపక్రమిస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గం మునగాలపాడు పరిధిలోకి వచ్చే సర్వే నంబర్ 197లో ఉన్న 14.69 ఎకరాలతో పాటు పాణ్యం నియోజకవర్గ పరిధిలోని 94, 95, 96, 97, 98, 99, 100, 103 నుంచి 107 సర్వే నంబర్లలో యార్డు నిర్మాణం చేపట్టేందుకు.. దారి కోసం 101, 111, 141, 142, 143, 147 సర్వే నంబర్లను పరిశీలిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరా భూమి ధర కోటి రూపాయల పైమాటేనని రైతులు చెబుతున్నారు. ఇక్కడికి సమీపంలోని ఓ ఎకరా పొలం ఇటీవల రూ.35 లక్షలకు రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రజావసరాల నిమిత్తం భూములు సేకరించే సమయంలో నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌కు మూడేళ్ల క్రితం జరిగిన రిజిస్ట్రేషన్ విలువలను భూసేకరణ అధికారి పరిగణనలోకి తీసుకుంటారు.

ఆ ప్రకారం భూముల ధర నిర్ణయించాల్సి ఉంది. అయితే ప్రస్తుత వ్యవహారం అందుకు భిన్నంగా సాగుతున్నట్లు సమాచారం. ఒకవేళ గత మూడేళ్లలో రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉంటే.. బూస్ట్‌సేల్‌గా చూపి భూములను వీలైనంత తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
 విషయం తెలుసుకున్న రైతులు కొందరు కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అధికారులు సంబంధిత రైతులతో చర్చలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. నయానో భయానో వారిని ఒప్పించి ముందుగానే అంగీకార పత్రాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా రైతుల కోసం నిర్మిస్తున్న మార్కెట్‌కు అదే రైతులను బలి పెట్టడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement