‘ఈనాం’ వేదన ఇంకెన్నాళ్లు?
► భూములు తీసుకున్నారు..
► కౌలు చెక్కులు ఇవ్వనంటున్నారు
► తీవ్ర ఆవేదనలో ఈనాం భూముల రైతులు
► సమస్యను నాన్చుతున్న పాలకులు
► సీఎం నిర్ణయం కోసం రాజధాని రైతుల ఎదురుచూపులు
రాజధాని కోసం అందరు రైతుల్లా భూములిచ్చారు.. కౌలు చెక్కులు అందుతాయని.. పరిహారంతో బతుకు బండి సాఫీగా సాగుతుందని ఆశపడ్డారు. కాలం గిర్రునా తిరుగుతున్నా.. కార్యాలయాల చుట్టూ తిరిగి చెప్పులరుగుతున్నా.. భూయాజమాన్య హక్కు పత్రాలు చూపుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. నేటికీ కౌలు చెక్కులు అందలేదు. ఆ బాధితులే రాజధాని ప్రాంతంలోని ఈనాం భూముల రైతులు. అభ్యంతరాలున్నాయని అధికారులు చెప్పేమాటలు.. భూమి కోల్పోయి ఉపాధి కరువై ఇళ్లు గడవని పరిస్థితులు.. ప్రశ్నగా మారుతున్న భవిష్యత్తు.. ఈనాం భూముల రైతులను కన్నీరు పెట్టిస్తోంది.
తుళ్ళూరు రూరల్ : రాజధాని ప్రాంతంలో ఈనాం భూముల వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈనాం భూములకు సంబంధించిన పంచాయితీ ముఖ్యమంత్రి వద్దకు చేరినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. రాజధాని గ్రామాల్లో సుమారు 150 ఎకరాలు ఈనాం భూములు ఉన్నట్లు సమాచారం. ఈ భూములను రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న ప్రభుత్వం నేటికీ కౌలు చెక్కులు పంపిణీ చేయలేదు. రాజధాని గ్రామం నెక్కల్లులో 158 సర్వే నంబరులో 14 ఎకరాల 7 సెంట్లు, 59లో 11 ఎకరాల 40 సెంట్లు భూమికి సంబంధించి 20 మంది రైతులు ల్యాండ్ పూలింగ్‌లో 9.3 ఫారం ద్వారా భూములిచ్చినప్పటికీ ఇప్పటి వరకు కౌలు చెక్కుల పంపిణీ జరగలేదు. దొండపాడు గ్రామంలో సర్వే నంబరు 36లో 24 మంది రైతులు 9 ఎకరాల 98 సెంట్లను ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చారు.
వీరికి ఇప్పటివరకు కౌలు చెక్కుల ఊసేలేదు. తాము 1925వ సంవత్సరం నుంచి సదరు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, భూయాజమాన్య హక్కు పత్రాలు ఉన్నాయని, తమకు కౌలు చెక్కులు ఇవ్వాలంటూ వేడుకుంటున్నా ఫలితం లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్టర్ డాక్యుమెంట్లు, పాత పట్టాదారు పాసు పుస్తకాలు, రైత్వారీ పట్టాగా మార్పు చేసిన ఫారం-8 నకళ్లను అధికారులకు అందజేశామని, కానీ ప్రభుత్వం ఇంతవరకు ఎటూ తేల్చకుండా తాత్సారం చేస్తోందంటూ వాపోతున్నారు.
దేవాదాయశాఖాధికారులు ఈనాం భూములంటూ అభ్యం తరం చెప్పడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గత ఏడాది సెప్టెంబరులో తుళ్ళూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో రైతులు, దేవాదాయ శాఖాధికారులతో చర్చించారని రైతులు గుర్తుచేస్తున్నారు. భూములిచ్చి ఏడాది దాటినా మాటలు చెప్పడం తప్ప ప్రభుత్వం చేసిందేమీలేదని మండిపడుతున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో కొద్ది రోజుల క్రితం అనంతవరంలో సమావేశమైన రాజధాని గ్రామాల రైతులు ప్రభుత్వ వైఖరిని తూర్పార బట్టారు. సీఆర్‌డీఏ అధికారులు ఈ వ్యవహారంలో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని, సమస్య ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందని చెబుతున్నారని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నిర్ణయం ఏవిధంగా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.