గన్నవరం ఎయిర్‌పోర్టుకు 2,460 ఎకరాల భూ సమీకరణ గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయస్థాయిలో...
సాక్షి, విజయవాడ : గన్నవరం ఎయిర్‌పోర్టుకు 2,460 ఎకరాల భూ సమీకరణ గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చెందాలంటే మూడువేల ఎకరాల భూమి కావాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 580 ఎకరాల్లో విమానాశ్రయం ఉంది. తొలివిడతగా 490 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి సేకరించనున్నారు. విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకురావాలంటే మరో 1,970 ఎకరాలు అవసరమవుతుంది. గన్నవరం విమానాశ్రయాన్ని విస్తరించేందుకు అవసరమైతే ఏలూరు కాల్వను కూడా మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం, అధికారులు ఉన్నట్టు సమాచారం.
నష్టపరిహారం విషయం తేల్చరేం?
గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు తొలివిడతగా 340 మంది రైతుల నుంచి 490 ఎకరాల భూమిని సేకరించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడమే కాకుండా ఏయే రైతుకు ఎంతెంత భూమి పోతుందో కూడా తెలియజేశారు. కేసరపల్లిలో ఎకరాకు రూ.98 లక్షలు,బుద్దవరంలో రూ.57లక్షలు, అజ్జంపూడి లో రూ. 46 లక్షలు నష్టపరిహారం ఇస్తామని చెబుతున్నారు. అయితే, కేసరపల్లిలో ఇచ్చే రేటే మిగిలిన గ్రామాల్లోనూ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే, ల్యాండ్‌పూలింగ్ పద్ధతిలో భూసమీకరణకు సహకరించాలంటూ ప్రభుత్వం రైతులను కోరుతోంది. ల్యాండ్ పూలింగ్‌కు సహకరించకపోతే బలవంతంగా అయినా భూమి సమీకరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు తప్ప రైతులు కోరిన విధంగా నష్టపరిహారం ఇచ్చే విషయం మాత్రం తేల్చడం లేదు.
బందరు పోర్టు మాటేమిటి?
అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోగా మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిం చారు. ఆయన జిల్లాకు వచ్చిన ప్రతిసారీ నాయకులు పోర్టు విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరిగితే వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటాయి. పోర్టు విస్తరణకు 4,800ఎకరాల భూమి కావాల్సి ఉండగా, ఇందులో 2,450ఎకరాలు ప్రభుత్వ భూమి, రైతుల వద్ద నుంచి సుమారుగా 2,350ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూసేకరణకు సంబంధించి సర్వే పూర్తిచేసి భూములు ఏయే రైతులకు చెందినవో కూడా గుర్తించారు. ఆ తరువాత భూసేకరణ కానీ, భూ సమీకరణపై కానీ దృష్టి పెట్టలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది అవుతున్నా పోర్టుకు శంకుస్థాపన రాయి పడలేదు.
పర్యాటకాభివృద్ధికి 10వేల ఎకరాలు
కృష్ణానదికి దక్షిణ భాగంలో రాజధాని నిర్మాణం జరుగుతుంటే, ఉత్తర భాగంలో టూరిజం అభివృద్ధి చేయడంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టిసారించింది. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వరకు న దీతీరం నుంచి హైవేకు మధ్య ఉండే ఖాళీ స్థలాలను, ప్రయివేటు భూములు సుమారు 10వేల ఎకరాలు ఉంటాయి. ఈ భూములను సేకరించి ఇక్కడ టూరిజం అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఈ భూముల్లో కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. నదికి అభిముఖంగా ఉండటంలో భూముల ధర చుక్కల్ని అంటుతోంది. కంచికచర్ల, నందిగామ మండల్లాలో భూమి సేకరించి సిబ్బందికి క్వార్టర్స్ కట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాజధాని రావడంతో తమ భూముల రేట్లు పెరిగాయని రైతులు సంతోషపడుతుంటే.. వాటిపై ప్రభుత్వం కన్నేయడంతో రైతులు అయోమయంలో పడ్డారు.
పారిశ్రామిక హబ్ కోసం 30వేల ఎకరాలు
నందిగామ నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా నూజివీడు వరకు సుమారు 30 ఎకరాల భూములను భూసమీకరణ ద్వారా స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేస్తే నూతన రాజధానికి ఆర్థిక పరిపుష్టి సమకూరుతుందని అధికారులు, ప్రజాప్రతి నిధులు భావిస్తున్నారు. రాజధాని పేరుతో కోట్ల విలువైన భూములను తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.