కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన భూ సంస్కరణల జాతీయ ముసాయిదాను యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన భూ సంస్కరణల జాతీయ ముసాయిదాను యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో జాతీయ భూ సంస్కరణల ముసాయిదాపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న భూ సీలింగ్ చట్టాల అమలులో ఉన్న లోపాలను ఇప్పటికైనా అంగీకరించడం సంతోషదాయకమన్నారు.
ప్రస్తుతమున్న చట్టాలను ఉపయోగించి బెంగాల్, కేరళ, జమ్మూకాశ్మీర్‌లలో పేదలకు భూ పంపిణీ, కౌలుదారులకు హక్కులు కల్పించడంలో చేసిన కృషి దేశమంతటా అదేవిధంగా అమలు జరగాలని, అందుకు కేంద్రప్రభుత్వం ముసాయిదాను పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టం తీసుకు రావాలని కోరుతున్నామన్నారు. కేంద్రం ప్రతిపాదించిన భూగరిష్ట పరిమితి 1973 చట్టంలో సవరణలు చేసి సానుకూల అంశాలను చేర్చాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 రకాలుగా భూములను వర్గీకరించారని అన్నారు. దీని ప్రాతిపదిక మీద భూ సీలింగ్ పరిమితి అన్ని జిల్లాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములను సాగు చేసుకోవడానికి ఏక్‌సాల్ పట్టాలు ఇవ్వాలని కోరారు.
టీడీపీ నగర కార్యదర్శి బాలకృష్ణయాదవ్, బీసీ రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున, దళిత ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంగటి మనోహర్, రాయలసీమ దళిత హక్కుల పోరాట సమితి కన్వీనర్ రమణ, బీఎస్పీ జిల్లా నాయకుడు కానుగదానం, సీహెచ్‌ఆర్‌డీ శివారెడ్డి, జిల్లా రైతు వ్యవసాయ కూలీ సంఘం కార్యదర్శి నాగరాజు, కుల వివక్ష పోరాట సమితి జిల్లా కార్యదర్శి మొండెం సుధీర్‌కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జకరయ్య తదితరులు మాట్లాడారు.