బతుకులపై బండ | Landslides Four members dead | Sakshi
Sakshi News home page

బతుకులపై బండ

Dec 20 2015 11:55 PM | Updated on Sep 3 2017 2:18 PM

బతుకులపై బండ

బతుకులపై బండ

పొట్ట చేతపట్టుకుని బతుకు తెరువుకోసం ఎక్కడో శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖకు వలస వచ్చారు.

కొండచరియలు విరిగిపడి నలుగురి మృతి
 
‘బండ’బారిన బతుకులు కొండెక్కాయి. కాయకష్టం
చేసుకొని జీవిస్తూ.. ఏ కొండ మూలనో గుడిసెలు,
రేకుల షెడ్లు వేసుకొని కాలం  వెళ్లదీస్తున్న ప్రాణాలు
తెల్లారిపోయాయి. శనివారంనాటి వర్షానికి నానిన
కొండచరియలు విరిగిపడడంతో నలుగురి శరీరాలు
ఛిద్రమైపోయాయి. తాటిచెట్లపాలెం దరి సంజీవయ్య
నగర్‌లో నివసిస్తున్న సూర్యనారాయణ, అతని భార్య,
కొడుకు, ఏడేళ్ల మనవడి ప్రాణాలు ఆదివారం
వేకువజామున గాల్లో కలిసిపోయాయి.
 

విశాఖపట్నం/ మర్రిపాలెం/ కంచరపాలెం : పొట్ట చేతపట్టుకుని బతుకు తెరువుకోసం ఎక్కడో శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖకు వలస వచ్చారు. ఇరవై ఏళ్లుగా కూలీ నాలీ చేసుకుంటూ కలసి మెలసి జీవిస్తున్నారు. నిలువ నీడ లేకపోవడంతో ప్రమాదమని తెలిసినా కొండవాలునే రేకుల షెడ్డు వేసుకుని తలదాచుకుంటున్నారు. కానీ విధి వారిపై మరింత చిన్న చూపు చూసింది. కనికరం లేకుండా వృద్ధులతో పాటు బాలుడిని, ఓ యవకుడిని  మృత్యువు కబళించింది. అర్ధరాత్రి జనం నిద్రలో ఉండగా తాటిచెట్లపాలెంలోని సంజీవయ్యనగర్‌లో జరిగిన ఈ ఘోరం నగరంలో విషాదం నింపింది. కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచింది. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.

శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రాంతం రేగిడి మండలం సిర్లాం గ్రామానికి చెందిన దిమ్మడాపు సూర్యనారాయణ అతని కుటుంబ సభ్యులు ఇరవై ఏళ్ల క్రితం విశాఖకు వలస వచ్చారు. సంజీవయ్యనగర్‌లో నివాసం ఏర్పరుకున్నారు. కుటుంబ సభ్యులంతా కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. సూర్యనారాయణ అతని సోదరులు ముగ్గురు కూడా కొండకు ఆనుకుని ఉన్న స్థలం చదునుచేసి రేకుల షెడ్డు నిర్మించుకుని దానిని నాలుగు భాగాలుగా విభజించి నివసిస్తున్నారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. రాత్రి ఒంటి గంట సమయంలో అందరూ నిద్రలో ఉండగా ఇళ్ల మీద బండరాళ్లు పడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దిమడపు సూర్యనారాయణ(65), అతని భార్య మహలక్ష్మి(55), సోదరుడి కుమారుడు శ్రీరామ్(20), మనవడు ఆదినారాయణ(7)లపై బండరాళ్లు పడ్డాయి.

ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. బయటకు వచ్చి చూసే సరికి బాధితుల హాహాకారాలు వినిపించాయి. వెంటనే పోలీసులకు సమాయచారం అందించారు. కానీ వర్షం కురుస్తుండడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏం జరిగిందో చాలా సేపటి వరకూ అర్థం కాలేదు. తీవ్ర గాయాలతో బీరువా కింద ఉండిపోయిన శ్రీరామ్ తన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో పరుగుపరుగున వచ్చిన వారు వెంటనే శ్రీరామ్‌ను బయటకు తీశారు. శ్రీరామ్‌ను,  తీవ్రంగా గాయపడ్డ సూర్యనారాయణ సోదరుడు అప్పలసూరి, అతని భార్య మరియమ్మ, కొడుకు బాలరాజులను స్థానికుల సహాయంతో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీరామ్ చనిపోయాడు. తొలుత శిధిలాల కింద  బాలుడు ఆదినారాయణను గుర్తించి బయటకు తీయగా అప్పటికే మృతిచెందాడు. బండరాయి కింద సూర్యనారాయణ అతని భార్య మహలక్ష్మి ఉండిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇద్దరి మృతదేహాలు బయటకు తీశారు.
 
ఉన్న ఒక్క కొడుకును పోగొట్టుకుని...
అమ్మమ్మ తాతయ్యలతో రాత్రికి పడుకుంటానని చెప్పి వెళ్లాడు...అందనంత దూరానికి వెళ్లిపోయాడు... చిన్న కొడుకు ఎనిమిది నెలల క్రితం పచ్చకామెర్లతో చనిపోయాడు... ఉన్న ఒక్కగానొక్క కొడుకునూ ఇపుడు దేవుడు తీసుకువెళ్లిపోయాడు..మాకు పుత్రశోకమే మిగిలింది..అంటూ మృతుడు గొట్టాపు ఆదినారాయణ (7) తల్లిదండ్రులు భోరున విలపించారు. గొట్టాపు గవరయ్యకు ఇద్దరు భార్యలు. తొలి భార్య రామలక్ష్మికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండో భార్య మణికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాదంలో మృతి చెందిన బాలుడు ఆదినారాయణ పెద్ద కొడుకు. రోజూ తల్లి వద్ద నిద్రపోయే ఆదినారాయణ శనివారం తాత, మామ్మ వద్ద పడుకుంటానని వచ్చాడు. ప్రమాదంలో తాత మామ్మలతో కలిసి మరణించాడు. మరో తమ్ముడు చరణ్(4) ఈ ఏడాది మార్చిలో పచ్చకామెర్ల వ్యాధితో మృతిచెందాడు.
 
 
కాపాడమంటూ స్నేహితులకు ఫోన్
దిమడపు శ్రీరామ్ హోండా యాక్టివా మెకానిక్‌గా పనిచేసేవాడు. శనివారం దుకాణం మూసి ఇంటికి వెళ్లిపోయాడు. అర్థరాత్రి సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయని కొందరు చనిపోయారని, తాను బండరాళ్ల మధ్య చిక్కుకుపోయానని తనను కాపాడమని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లమని ఫోన్ చేయడంతో వెంటనే వెళ్లాం. ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి శ్రీరాంను బయటకు తీసి ఆసుపత్రికి తరలించాం...అయితే ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయాం...ఓ మంచి స్నేహితుడ్ని కోల్పోయాం.            - శ్రీరామ్ స్నేహితులు బుజ్జి, కుమార్, ఈశ్వర్
 
ప్రాణాలతో బయటపడిన శునకం

సంఘటన జరిగిన ప్రాంతంలో యాజమాని కోసం విశ్వాసం చూపిద్దామనుకుందో ఏమో.....ఆ శునకం బండరాళ్ల మధ్య 12గంటల పాటు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని తుదకు బతుకు జీవుడా అని బయటపడింది. రాళ్ల కింద నగిలిపోయిన దంపతులను అగ్నిమాపక సిబ్బంది, రోప్ సిబ్బంది, రెస్క్యూ టీం, పోలీసు అధికారులు సహాయక చర్యల్లో మనుషులు ప్రాణాలను కాపాడలేక పోయినా ఓ మూగ జీవికి ప్రాణాలు పోశారు. కుక్కను ప్రాణాలతో బయటకు తీసిన వెంటనే స్థానికులు ప్రథమ చికిత్స చేశారు.
 
రక్షణగోడలు నిర్మించాలి : తైనాల
ఉత్తర నియోజకవర్గంలో కొండవాలు ప్రాంతాల్లో రక్షణ చర్యలు పెట్టాలని వైఎస్సార్ సీపీ ఉత్తర కన్వీనర్ తైనాల విజయకుమార్ ప్రభుత్వాన్ని కోరారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
 
నాయకుల పరామర్శలు
విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గొల్ల. బాబురావు, కటుమూరి సతీష్, మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారావు, పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి, గుంటూరు భారతి, కొల్లాబత్తుల వెంగళరావు, యర్రాంశెట్టి శ్రీనువాసురావు తదితరులు బాధితులను పరామర్శించారు.
 
తక్షణ చర్యల్లో అధికారులు
జిల్లా జాయింట్ కలెక్టర్ నివాస్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్, జోనల్ కమిషనర్ నర్సింహారావు, ఆర్‌డీవో వెంకటేశ్వరరావు, పోలీస్ ఉన్నతాధికారులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
 
బాధిత కుటుంబాలకు ఎండీ నజీర్ చేయూత
టీడీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ఎండీ నజీర్ బాధిత కుటుంబాలకు పదివేల రూపాయల నగదును అందజేశారు. నేలమట్టమయిన ఇళ్లల్లో సమస్తం కోల్పోయారని అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా ప్రతినిధి ఇమంతి రమణ, అర్బన్ జిల్లా కార్యదర్శి ఈతలపాక సుజాత, వార్డు కార్పొరేటర్ అమ్మోరు, దయాల ఈశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement