సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఆడలేక మద్దెల ఓడనన్నట్లుంది టీడీపీ వర్గీయుల తీరు..! బోగస్ ఓటర్లను భారీ ఎత్తున చేర్పించిన టీడీపీ.. అదే రీతిలో వ్యతిరేక పార్టీలకు ఓటేసే వారి పేర్లను తొలగించేందుకు కుట్ర పన్నింది. ఆ క్రమంలోనే ఎలక్షన్ వాచ్ పేరిట టీడీపీ వర్గీయులతో ఓ సంస్థను ఏర్పాటుచేసి, సర్వే చేసినట్లు భ్రమింపజేసింది.
తమ కార్యకర్తలతో తప్పుడు ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు చేయించారు. ఈ తప్పుడు ఫిర్యాదులను ఆధారాలతో భన్వర్‌లాల్‌కు వివరించి.. సైబర్ క్రైం కింద కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి కోరనున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉరవకొండ నియోజకవర్గం జనాభా 2,74,716. ఇందులో మహిళలు 1,35,880, పురుషులు 1,38,836. ప్రతి వెయ్యి మంది జనాభాకు 619 మంది ఓటర్లు ఉండటం శాస్త్రీయమని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల సంఘం నిబంధల మేరకు ఉరవకొండ నియోజకవర్గంలో 1,70,0049 మంది ఓటర్లు ఉండవచ్చు. కానీ.. 1,81,195 మంది ఓటర్లు ఉన్నారు. అంటే.. 11 వేలకుపైగా బోగస్ ఓటర్లు ఉన్నట్లు విశదమవుతోంది. ఈ అంశాన్ని కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ కూడా బాహాటంగా అంగీకరిస్తున్నారు. బోగస్ ఓటర్లను తొలగిస్తామని ప్రకటించారు. కానీ.. కలెక్టర్ ఆదేశాలను బీఎల్‌వోలు, తహశీల్దార్లు క్షేత్ర స్థాయిలో అమలు చేయడం లేదు.
దీనికి ప్రధాన కారణం.. టీడీపీ వర్గీయుల బెదిరింపులే. ఇదొక పార్శ్వమైతే.. మరొక పార్శ్వం వ్యతిరేక పార్టీలైన వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగింపజేసేందుకు కుట్ర పన్నడం. ఉరవకొండ నియోజకవర్గంలో ఎలెక్షన్ వాచ్ సంస్థ నిర్వహించిన సర్వే.. ఏడు వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు తేలాయని, వాటిని తొలగించాలని ఫారం-7లను ఆన్‌లైన్‌లో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడే తప్పులో కాలేశారు. ఓటరు జాబితా నుంచి ఒకరిని తొలగించాలంటే.. అందుకు అదే గ్రామానికి చెందిన మరొక ఓటరు ప్రతిపాదిస్తూ ఫారం-7పై సంతకం చేయాలి. ఫలానా వ్యక్తి తమ గ్రామంలో ఉండటం లేదని.. ఆయనకు మరొక ప్రాంతంలో ఓటు ఉందని, ఆయన పేరును జాబితా నుంచి తొలగించాలని ఫారం-7పై సంతకం చేసి, అధికారులకు అందించాల్సి ఉంటుంది.
వీటిపై బీఎల్‌వో, తహశీల్దార్లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి.. ఆర్డీవోకు నివేదిక ఇస్తారు. అనర్హులని తేలితే సంబంధిత వ్యక్తుల పేరును ఓటరు జాబితా నుంచి తొలగిస్తామని నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు జారీ చేసిన వారం రోజుల్లోగా తాను ఆ గ్రామంలోనే నివాసం ఉంటున్నట్లు, తనకు మరొక చోట ఓటు లేనట్లు అఫిడవిట్ సమర్పిస్తే, సంబంధిత వ్యక్తి పేరును ఓటరు జాబితా నుంచి తొలగించరు. లేనిపక్షంలో తొలగిస్తారు. కానీ.. ఎలెక్షన్ వాచ్ ఆన్‌లైన్‌లో చేసిన ఫిర్యాదుల్లో ఈ నిబంధనను ఏవీ పాటించలేదు. అయినా.. వాటిని అధికారులు పరిగణనలోకి తీసుకుని, ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు.. ఉరవకొండ నియోజకవర్గంలో ఏడు వేల మందిని ఓటరు జాబితా నుంచి తొలగించడానికి కుట్ర పన్నారు.
కూడేరు మండలం కమ్మూరులో ఇంటి నంబరు 1-19లో నగరూరు పరమేశ్వరరెడ్డి నివసిస్తున్నారు. నగరూరు పరమేశ్వరరెడ్డి, ఆయన భార్య జయంతిలకు ఓటరు జాబితాలో (వరుస నం: 78, 79) పేర్లున్నాయి. కానీ.. వారు అక్కడ నివసించడం లేదని అదే గ్రామానికి చెందిన వన్నూరప్పతో ఫిర్యాదు చేసినట్లు ఎలెక్షన్ వాచ్ పేర్కొంది. కానీ.. ఆ ఫిర్యాదును తాను ఇవ్వనే లేదని వన్నూరప్ప చెబుతున్నారు. కానీ.. ఎన్నికల అధికారులు ఎలెక్షన్ వాచ్ ఫిర్యాదునే ప్రాతిపదికగా తీసుకుని.. ఆ ఇద్దరికీ ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. ఈ గ్రామంలో వారిద్దరికే కాదు.. ఏకంగా 51 మందకి నోటీసులు జారీ చేసింది.
= ఇదే పద్ధతిలో ఉరవకొండ మండలం రాకెట్లలో 330 ఓట్లను తొలగించాలని ఎలెక్షన్ వాచ్ సంస్థ ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదు చేసింది. ఎన్నికల అధికారులు ఎలెక్షన్ వాచ్ ఫిర్యాదునే ప్రాతిపదికగా తీసుకుని.. వారికి ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు.
ఎలెక్షన్ వాచ్ కాదు.. టీడీపీ వాచ్:
ఎలెక్షన్ వాచ్ టీడీపీ ఏర్పాటు చేసుకున్న బోగస్ సంస్థ. ఆ సంస్థ ఉరవకొండలో ఎలాంటి సర్వే చేయలేదు. కానీ.. చేసినట్లు తప్పుడు మాటలు చెబుతోంది. వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉండే వారి పేర్లను జాబితా నుంచి తొలగింపజేసి, దొడ్డిదారిన గెలవాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చూస్తున్నారు.
అందుకే ఎలెక్షన్ వాచ్ పేరుతో ఆన్‌లైన్‌లో తప్పుడు ఫిర్యాదులు చేశారు. పయ్యావుల కేశవ్‌కు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కోవాలి. దొడ్డిదారిన సైబర్ నేరాలకు పాల్పడటం సరి కాదు. ఈ అంశంపై ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేస్తాం. ఇదే అంశంపై సోమవారం కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేస్తా. తప్పుడు ఫిర్యాదు చేసిన వారికి శిక్షపడే వరకూ మడమ తిప్పకుండా పోరాడతాం.
- వై.విశ్వేశ్వరరెడ్డి,
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఉరవకొండ
అక్రమాల ‘కొండ’
Published Mon, Dec 30 2013 3:30 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement