మంథని రూరల్, న్యూస్‌లైన్ : మూడు దశాబ్దాల అజ్ఞాతవాసం తర్వాత వచ్చిన కొడుకు ఇక తనతోనే ఉంటాడని... కాటికి కాలుచాపిన తనకు ఆసరా అవుతాడని అనుకున్న ఆ తల్లి ఆశ నెరవేరలేదు. ఎప్పటికైనా రాకపోతాడా? అని కళ్లల్లో వత్తులు వేసుకుని చూసీ... చూసీ... చివరకు కొడుకు రాకుండానే కన్నుమూసిందా మాతృమూర్తి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి తల్లి రాధమ్మ(90) మంగళవారం చనిపోయింది.
మంథని మండలం ఎగ్లాస్‌పూర్ పరిధి శాస్త్రులపల్లికి చెందిన రాజిరెడ్డి 1975లో అజ్ఞాతంలోకి వెళ్లినప్పటినుంచి ఏనాడూ తల్లిదండ్రులను చూసేందుకు రాలేదు. ఏనాటికైనా కొడుకు రాకపోతాడా? అని చెమ్మగిల్లిన కళ్లతో రాధమ్మ ఎదురుచూసేది. 2009లో ఓ సారి కేసు నిమిత్తం మంథని కోర్టుకు పోలీసులు రాజిరెడ్డిని తీసుకొచ్చినప్పుడు రాజిరెడ్డితో ఆమె మాట్లాడింది. అప్పటికే ఆయన తండ్రి మరణించగా... కనీసం ఇప్పటికైనా ఇంటికి రావాలని, ముసలితనంలోనైనా తనకు తోడుగా ఉండాలని తల్లి కోరింది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని తల్లికి నచ్చజెప్పి వెళ్లిన రాజిరెడ్డి మళ్లీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొడుకు కోసం ఎదురుచూసీ చూసీ ఆశ నెరవేరకుండానే మంగళవారం ఆమె కన్నుమూసింది.
తల్లిని కడసారి చూసుకునేందుకు రాజిరెడ్డి రావొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతడు ఎక్కడ ఉన్నాడనే సమాచారం మాత్రం తెలియరాలేదు. ఉద్యమమే ఊపిరిగా భావించిన రాజిరెడ్డి తన తండ్రి మరణించినప్పుడు కూడా రాలేదని, తల్లి మరణవార్త తెలిసినా రాకపోవచ్చని గ్రామస్తులు పేర్కొంటున్నారు. రాధమ్మ అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు, రాజిరెడ్డి అభిమానులు వచ్చే అవకాశముందని పోలీసులు గ్రామంపై గట్టి నిఘా పెట్టినట్లు సమాచారం.
చివరి కోరిక తీరకుండానే..
Published Wed, Dec 4 2013 3:35 AM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM
Advertisement