సాక్షి, కర్నూలు: ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ప్రజాప్రతినిధుల దృష్టి అధికారులపై పడింది. అనుకూలంగా వ్యవహరించే వారి కోసం అన్వేషణ మొదలైంది. ప్రధానంగా పోలీసు శాఖపై పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు. ఇదే సమయంలో తమ స్థానాలను పదిలం చేసుకునేందుకు కొందరు అధికారులు సైతం నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలవుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారుల్లో అధిక శాతం కొత్త వారే కావడం గమనార్హం. ఎన్నికల ముందు ప్రొబేషన్ పూర్తి చేసుకున్న సుమారు 45 మంది ఎస్‌ఐలకు జిల్లాలో పోస్టింగ్‌లు ఇచ్చారు. వీరితో పాటు కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి 26 మంది సీఐలు బదిలీపై జిల్లాకు వచ్చారు.
ఎన్నికల నిబంధనల్లో భాగంగా జిల్లా నుంచి 23 మంది సీఐలను రేంజ్ పరిధిలోని అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు బదిలీ చేశారు. 2వ తేదీతో అన్ని స్థాయిల్లో బదిలీలపై నిషేధం ఎత్తేయనున్నారు. ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా సీఐలు, ఎస్‌ఐల బదిలీలకు తెర లేవనుంది. ఈ నేపథ్యంలో తమ చెప్పుచేతల్లో ఉండే అధికారుల సమాచారం సేకరణలో నేతలు బిజీగా ఉంటున్నారు. క్షేత్ర స్థాయిలో కీలకమైన ఎస్‌ఐలు తమ కనుసన్నల్లో మెలిగేలా చూసుకునేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇందుకోసం వారి సామాజికవర్గం.. గతంలో పనితీరు ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన సిబ్బందిపైనా నాయకులు దృష్టి సారిస్తున్నారు.
ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఆ మేరకు కింది స్థాయి నాయకులతో శాసనసభ్యులు పూర్తి స్థాయి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. సీఐల నుంచి కానిస్టేబుల్ వరకు బదిలీ జాబితాలు రూపొందించినట్లు చర్చ జరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో సీఐలతో పాటు డీఎస్పీ పోస్టింగ్‌లకు సైతం గిరాకీ పెరిగింది. జిల్లాలో ఎస్‌ఐ, సీఐ హోదాల్లో పనిచేసిన పలువురు అధికారులు ప్రస్తుతం డీఎస్పీలుగా ఏసీబీ, సీఐడీ తదితర విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో పలువురు ఇప్పటికే తమకు అనుకూలమైన పోస్టింగ్ కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. శాసనసభ్యుల వద్ద సన్నిహితంగా మెలిగే ద్వితీయ శ్రేణి నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో చక్రం తిప్పే నేత ఎవరనే విషయంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
నేతల చుట్టూ ప్రదక్షిణలు
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి ఒకరు బదిలీల విషయంలో దూకుడు కనబరుస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పోలీసుల బదిలీల్లో అనుకూలురైన అధికారులను నియమించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు పలువురు సీఐలు, ఎస్‌ఐలతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. ఇటీవలి వరకు జిల్లా పోలీసు శాఖలో కీలకంగా వ్యవహరించిన అధికారి ఒకరు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడంతో హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆయనను తిరిగి జిల్లాకు తీసుకొచ్చేందుకు ఆ నేత విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. అయితే ఆయన రాకను అదే పార్టీలోని మరికొందరు నేతలు వ్యతిరేకిస్తుండటం గమనార్హం. జిల్లాలోని కీలకమైన టీడీపీ నేతల చుట్టూ కొందరు పోలీసు అధికారులు ఇప్పటికే ప్రదక్షిణలు చేస్తున్నారు. తమను ఇన్నాళ్లు అప్రాధాన్య స్థానాల్లో ఉంచారని.. ఇప్పటికైనా తమను గుర్తుంచుకోవాలని కోరుతూ భరోసా పొందుతున్నట్లు ప్రచారం ఉంది.
మార్చేద్దాం!
Published Mon, Jun 2 2014 2:28 AM | Last Updated on Sat, Aug 11 2018 8:11 PM
Advertisement
Advertisement