సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా కుంటి నడక నడుస్తున్న సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ నేటి నుంచి సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది. ఈ నెల 19న సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభమవగా.. సీమాంధ్ర ప్రాంతంలో 34 కేంద్రాలకు గాను 19 కేంద్రాలు పనిచేయలేదు. ఈ సహాయక కేంద్రాలన్నీ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉండడం, ఆ కళాశాలల అధ్యాపక సిబ్బంది ఎంసెట్ విధుల బహిష్కరణకు పిలుపునివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో మరో నాలుగు అదనపు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ తనిఖీ ప్రక్రియ షెడ్యూలు ప్రకారం పూర్తిస్థాయిలో సాగడం లేదు. ఈ నేపథ్యంలో సాంకేతిక విద్య కమిషనర్, ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ అయిన అజయ్ జైన్, జాయింట్ డెరైక్టర్ యూవీఎస్‌ఎన్ మూర్తి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్(పాలా) ఛైర్మన్, ప్రతినిధి బృందంతో మంగళవారం జరిపిన చర్చలు ఫలించాయి.
బుధవారం నుంచి విధుల్లో చేరేందుకు ‘పాలా’ ప్రతినిధులు అంగీకరించారు. ఈ మేరకు అజయ్‌జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాలిటెక్నిక్ అధ్యాపకులు విధుల్లో చేరేందుకు అంగీకరించినందున ఎంసెట్ సహాయక కేంద్రాలన్నీ బుధవారం నుంచి సజావుగా పనిచేస్తాయని తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆయా పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉన్న కేంద్రాల్లో సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అయితే ఇప్పటివరకు పనిచేయని కేంద్రాల్లో 1 నుంచి 1,60,000 లోపు ర్యాంకర్లు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరుకాలేకపోయిన వారందరికీ కొత్తగా షెడ్యూలు జారీ చేస్తామని తెలిపారు. అతి త్వరలోనే ఈ షెడ్యూలు వెలువడుతుందన్నారు.
30న నిర్ణయం..: మరోవైపు మంగళవారం సాయంత్రం ఉన్నత విద్యామండలిలో ఈ కౌన్సెలింగ్ ప్రక్రియపై మండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్ జైన్ సమీక్ష జరిపారు. సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ సజావుగా సాగే పక్షంలో ఈ నెల 30న మరోసారి సమీక్ష జరిపి, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ షెడ్యూలు జారీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ సర్టిఫికెట్ల తనిఖీకి హాజరుకాని విద్యార్థులు వెంటనే ఈ ప్రక్రియలో పాల్గొనాలని సూచిస్తూ విద్యార్థుల మొబైల్ నంబర్లకు ఎస్.ఎం.ఎస్. పంపించాలని నిర్ణయించారు. సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియకు 9వ రోజు మొత్తం 11,512 మంది హాజరయ్యారు. సీమాంధ్రలో 38 కేంద్రాలకు గాను 19 కేంద్రాలు పనిచేయగా వీటిలో 6,051 మంది హాజరై ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. తెలంగాణలోని 22 కేంద్రాల్లో 5,461 మంది హాజరయ్యారు.
బీ-కేటగిరీపై ప్రభుత్వానికి నివేదన: ఇంజనీరింగ్ బీ-కేటగిరీ సీట్ల భర్తీపై ఈనెల 13న నోటిఫికేషన్ వెలువడిన తరువాత హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తాజా తీర్పునకు అనుగుణంగా తిరిగి నోటిఫికేషన్ జారీచేయాలా? లేక 13 నాటి నోటిఫికేషన్‌ను కొనసాగించాలా? కొత్త నోటిఫికేషన్ జారీచేస్తే 13 నాటి నోటిఫికేషన్‌కు అనుగుణంగా భర్తీ అయిన ప్రవేశాల పరిస్థితి ఏంటి? తదితర విషయాలపై న్యాయ సలహా తీసుకొని స్పష్టత ఇవ్వాల్సిందిగా ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం ఇచ్చే స్పష్టత ఆధారంగా బీ-కేటగిరీ సీట్లపై నిర్ణయం తీసుకుంటామని మండలి ైచైర్మన్ జయప్రకాశ్‌రావు తెలిపారు.
సర్టిఫికెట్ల పరిశీలనకు తొలగిన అడ్డంకులు
Published Wed, Aug 28 2013 3:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement