ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో మండలి కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు సహా పలు మూడు బిల్లులపై చర్చించనట్లుగా తెలిపారు.
కాగా అసెంబ్లీ సమావేశాలు సోమ, మంగళవారాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జరుగుతాయని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఆ రెండు రోజులు గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుందన్నారు. మూడు తీర్మానాలు, ఒక బిల్లు సభలో ప్రవేశపెడతామని కాల్వ శ్రీనివాసులు చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ ఘటనలో మృతి చెందిన విద్యార్థులకు సంతాపం, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలలకు అభినందన తీర్మానం, పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాపై తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అలాగే ఉద్యోగుల వయో పరిమితి బిల్లును ప్రవేశపెడతామని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.