
చిరుత చిక్కింది
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 60 గొర్రెలను ఆ చిరుతలు పొట్టనపెట్టుకున్నాయి. గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేసాయి. ‘గండికోట’కు పర్యాటకులు బిక్కుబిక్కుమంటూవచ్చేవారు. అటవీ అధికారులు ఏర్పాటుచేసిన బోనులో మూడేళ్ల వయసున్న ఆడ చిరుత శుక్రవారం చిక్కింది. దీనికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి తిరుపతి జూకు తరలించారు. మరో మగ చిరుతను కూడా త్వరలో పట్టుకుంటామని డీఎఫ్‌ఓ శివశంకర్ రెడ్డి తెలిపారు.
జమ్మలమడుగు: గండికోట గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్న చిరుత పులుల్లో ఒకటి బోనుకు చిక్కింది. నెలరోజుల నుంచి మండల పరిధిలోని ప్రజలకు ఈ చిరుత పులులు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 60 గొర్రెలను పొట్టనబెట్టుకున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గండికోట పరిసర ప్రాంతాల్లో గ్రామస్తులకు ఇవి కనిపించేవి. దీంతో ఒంటరిగా తిరగాలంటే భయపడే స్థాయికి గ్రామస్తులు వచ్చారు. గండికోట పర్యాటక ప్రదేశం కావడంతో పర్యాటకులకు కూడా చిరుత భయం పట్టుకుంది. చిరుత పులులు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అటవీ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిరుత జాడలు కనిపించడం లేదని, ఏమైనా కనిపిస్తే ఫొటోలు తీయాలని గ్రామస్తులకు అటవీ సిబ్బంది సూచించారు. నాలుగురోజుల క్రితం పట్టపగలు గొర్రెల మందలోనుంచి గొర్రెను చిరుతపులి తీసుకుని పోతుండటంతో గొర్రెల కాపరి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశాడు. సమీపంలో ఆవుల మంద ఎక్కువగా ఉండటంతో ఒకేసారి ఆవులు పరుగెత్తాయి. దీంతో చిరుత భయపడి గొర్రెను వదిలేసి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని అధికారులకు తెలపడంతో బోను ఏర్పాటు చేశారు. బోనులో ప్రతి రోజు రాత్రి గొర్రె పిల్లలను కట్టేసి ఉంచుతూ వచ్చారు. శుక్రవారం తెల్లవారు జామున గొర్రెపిల్లను తినటానికి వచ్చిన చిరుత బోనులో చిక్కింది. చిరుత బోనులో చిక్కినట్లు తెలియడంతో దానిని చూడటానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు తరలివచ్చారు.
తిరుపతికి తరలింపు..
మూడేళ్ల వయస్సు ఉన్న చిరుత బోనుకు చిక్కిన విషయాన్ని డీఎఫ్‌ఓ శివశంకర్‌రెడ్డి తిరుపతి అటవీ అధికారులకు తెలిపారు. చిరుతను తిరుపతి జూకు తరలించాలని వారు సూచించారు. జూ సిబ్బంది చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తిరుపతికి తరలించారు. ఏఎస్పీ వెంకట అప్పలనాయుడు, తహశీల్దార్ శ్రీనివాసన్, ఎంపీడీఓ మల్లయ్య, ఇఓపీఆర్‌డీ రామచంద్రారెడ్డి పరిస్థితులను సమీక్షించారు.
పరిహారం చెల్లిస్తాం
చిరుత పులుల దాడిలో గొర్రెలను కోల్పోయిన గొర్రెల కాపరులకు నష్టపరిహారం చెల్లిస్తామని డీఎఫ్‌ఓ శివశంకరరెడ్డి తెలిపారు. తమకు చెందిన 60 గొర్రెలను చిరుతపులులు చంపేశాయని గొర్రెలకాపరులు డీఎఫ్‌ఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ మాట్లాడుతూ ఎన్ని గొర్రెలు చనిపోయాయో విచారణ చేసి న్యాయం చేసే విధంగా ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు.
గండికోట పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్న ఆడ చిరుతను పట్టుకున్నామని, మగ చిరుతను కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. వన్యమృగాలను చంపకుండా వాటిని సంరక్షించుకోవలసిన బాధ్యత ఉందన్నారు. ఎవరైనా చంపితే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25లక్షల జరిమానా విధిస్తామన్నారు.