మంత్రుల ఇలాకాలో మద్యం పరవళ్లు | Liquor floats in ministers area | Sakshi
Sakshi News home page

మంత్రుల ఇలాకాలో మద్యం పరవళ్లు

Published Wed, Oct 19 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

మంత్రుల ఇలాకాలో మద్యం పరవళ్లు

మంత్రుల ఇలాకాలో మద్యం పరవళ్లు

* జిల్లాలో 1500కు పైగా బెల్టుషాపులు
అధికారపార్టీ అండతో చెలరేగుతున్న సిండికేట్లు
మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ శాఖ 
 
గ్రామాల్లో ప్రజలకు తాగునీరు లభించడం లేదు. మద్యం మాత్రం ఏరులై పారుతోంది. అసలే పంటలు దెబ్బతిని తీవ్ర నష్టాలపాలైన రైతులు మద్యానికి బానిసై జీవితాలు గుల్ల చేసుకుంటున్నారు. రోజువారి కూలీలు సైతం కూలి డబ్బుతో మద్యం సేవించి ఉత్త చేతులతో ఇంటికెళ్తున్నారు. 
 
సాక్షి, గుంటూరు: గ్రామాల్లో ఎటు చూసినా కరువు. కానీ మద్యం దుకాణాలు మాత్రం కళకళలాడుతున్నాయి. ఎక్సైజ్‌ నూతన మద్యం విధానం పేరుతో గ్రామాల్లో ఒక్క బెల్టు దుకాణం కూడా లేకుండా చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న అధికారపార్టీ ప్రజాప్రతినిధులే బెల్టు దుకాణాలను ప్రొత్సహిస్తున్నారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల నియోజకవర్గాల్లోనే అత్యధికంగా బెల్టుషాపులు ఉండటం విశేషం. అవి కూడా అమాత్యుల అనుచర గణం, అధికారపార్టీ కేడర్‌ నిర్వహిస్తుండటంతో ఆ నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతోంది. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. అధికార పార్టీ ఒత్తిళ్లు, మామూళ్లకు దాసోహమైన ఎక్సైజ్‌ అధికారులు నెలవారీ మామూళ్లు తీసుకుంటూ బెల్టుషాపుల వైపు కన్నెత్తి చూడడం లేదు. పర్యవసనంగా జిల్లాలో 342 మద్యం దుకాణాలు ఉండగా, బెల్టుషాపులు 1500కుపైగా చేరాయి.
 
24 గంటలూ అందుబాటు..
గ్రామాల్లోని చిల్లర దుకాణాల్లో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉండే పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఒకటి, రెండు చోట్ల ఎక్సైజ్‌ అధికారులు బెల్టుదుకాణాలపై దాడులు చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకోగానే, జిల్లాకు చెందిన ఓ మంత్రి ఫోన్‌ చేసి మనవాళ్లే వదిలేయండంటూ హుకుం జారీచేస్తుండటం జిల్లాలో పరిస్థితి తీవ్రతకు కారణం. గతంలో బెల్టుదుకాణాలపై దాడులు చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు, బెల్టుదుకాణాలకు మద్యం సరఫరా చేసే మద్యం దుకాణం లైసెన్సును రద్దు చేయాలని పోలీసు అధికారులు ఎక్సైజ్‌ ఉన్నతాధికారులకు లేఖలు రాసిన దాఖలాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అది కూడా కనిపించడం లేదు. మన పని కాదు కదా అంటూ పోలీసులు సైతం పట్టించుకోవడం లేదు. పైగా అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు, బార్‌లు నడుస్తున్నా నెలవారి మామూళ్లు తీసుకుంటూ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నారు. బెల్టుదుకాణాలను తొలగించాలని మహిళా సంఘాలు, గ్రామంలోని మహిళలు అనేక సార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల ఎదుట  ఆందోళనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
 
మనవాళ్లే వదిలేయండి..
మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న  ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో బెల్టు దుకాణాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలోని పసుమర్రు, మురికిపూడి, వేలూరు, కనపర్తి, తూబాడు, చందవరం, కారుచోల, జగ్గాపురం, వంకాయలపాడు, కొండవీడు గ్రామాల్లో అయితే పదికి పైగా బెల్టుదుకాణాలు ఉన్నాయి. ఇటీవల కనపర్తి గ్రామంలో బెల్టుదుకాణాలపై ఎక్సైజ్‌ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, వెంటనే మంత్రి ఫోన్‌చేసి వారిని వదిలేయాలని ఆదేశించినట్లు సమాచారం.  ప్రత్తిపాడు నియోజకవర్గంలో మండలానికి 40 నుంచి 50 బెల్టుదుకాణాలు నడుస్తున్నాయి. నడింపాలెం గ్రామంలో పది దుకాణాలున్నాయి. గతంలో గుంటూరు వచ్చిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ సైతం రాజధాని జిల్లా అయిన గుంటూరులో బెల్టుదుకాణాలు లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటామంటూ ఆర్భాటంగా ప్రకటించారు. కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement