
కారంచేడు పంచాయతీ కార్యాలయం
సాక్షి, కారంచేడు (ప్రకాశం): ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమరం ఎంతో రసవత్తరంగా ముగిసింది. ఆ వేడి చల్లారక ముందే స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామాల్లో ఆసక్తి కరంగా మారాయి. అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే అందరితో బెస్టు సీఎం అనిపించుకుంటున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు స్థానిక ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులకు ఎవరిని పోటీ చేయించాలనే కసరత్తును ఆయా పార్టీలు ప్రారంభించాయి. దీంతో గ్రామాల్లో రసవత్తర రాజకీయ చర్చలు జరుగుతున్నాయి.
మండలాల్లో జెడ్పీ, మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం జూలై మొదటి వారంతో ముగుస్తుంది. ఎన్నికల సంఘం జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ అధికారులను ఆదేశించింది. ఇదిలా ఉంటే సర్పంచ్‌లకు సంబంధించి వార్డుల వారీగా అధికారులు ఓటర్ల జాబితాను ఇటీవల ప్రచురించారు.ఈ నెల 20వ తేదీ పోలింగ్ కేంద్రాల జాబితాను సైతం వెల్లడించారు. దీంతో సర్పంచ్ ఎన్నికలు ముందు జరుగుతాయా జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికలు జరుగుతాయా అనే అనుమానం నాయకులను, అధికారులను వేధిస్తోంది. ఏది ఏమైనా గ్రామస్థాయిలో మాత్రం ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కీలకంగా మారనున్నాయి. కారంచేడు మండలంలో 14 పంచాయతీలున్నాయి. మొత్తం 138 వార్డులు ఉన్నాయి. పోలింగ్ బూత్‌లు 138 ఉన్నాయి. వీరిలో ఎస్టీ ఓటర్లు 1268, ఎస్సీ ఓటర్లు 7771, బీసీ ఓటర్లు 8782, ఓసీ ఓటర్ల 15,111 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 32,932 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 15998 మంది కాగా, మహిళా ఓటర్లు 16,934 మంది ఉన్నారు. రిజర్వేషన్లు ఖారారైతే ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు ఖారారైతే ఎవరిని పోటీలో ఉంచాలి అనే విషయంపై గ్రామాల్లో ఇప్పటికే లెక్కలు కడుతున్నారు.