డీఆర్‌డీఏలో అక్రమాలపై లోకాయుక్త విచారణ | lokayuktha enquriy on drda | Sakshi
Sakshi News home page

డీఆర్‌డీఏలో అక్రమాలపై లోకాయుక్త విచారణ

Published Mon, Dec 16 2013 2:39 AM | Last Updated on Sat, Mar 9 2019 4:10 PM

lokayuktha enquriy on drda

 ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : డీఆర్‌డీఏలో అవినీతిపై లోకాయుక్త విచారణ చేపట్టింది. గతంలో దీనిపై ఏసీబీ అధికారులు చేపట్టిన విచారణ తూతూమంత్రంగానే ఉందనే ఆరోపణలున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో 2009-11 కాలంలో పీడీగా పని చేసిన జీ నీలకంఠం అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఓ వ్యక్తి ఏసీబీ, మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు తనిఖీకి వస్తున్నట్లు రెండు రోజుల ముందుగా స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయానికి సమాచారమిచ్చారు. దీంతో అధికారులు రేయింబవళ్లు కష్టపడి నకిలీ ఫైళ్లను సిద్ధం చేశారు.
 
  అనంతరం ఏసీబీ అధికారులొచ్చి తమతోపాటు కొన్ని ఫైళ్లను నెల్లూరు తీసుకెళ్లి తనిఖీ చేశారు. వీటిలో లోపాలున్నట్లు గుర్తించారు. దీంతో అవినీతి జరిగిందని భావించి అప్పటి పీడీ నీలకంఠంతోపాటు కొందరు ఉద్యోగులను నెల్లూరు పిలిపించుకుని వారి వద్ద నుంచి రాత పూర్వకంగా వివరణ తీసుకున్నారు. ఆ తర్వాత దీనిపై పట్టించుకోలేదు. విచారణను అటకెక్కించారని భావించిన ఫిర్యాదు దారుడు తిరిగి లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో లోకాయుక్త స్పందించి దీనిపై విచారణకు గుంటూరు రీజియన్‌కు చెందిన రిటైర్డు డీఎస్పీ సీహెచ్ వెంకటరెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమించింది. రిటైర్డ్ డీఎస్పీ వారం క్రితం ఒంగోలు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అవినీతికి సంబంధించి ఫైళ్లు కావాలని డీఆర్‌డీఏ అధికారులను ఆయన కోరారు. ఫైళ్లు తమ వద్ద లేవని, ఏసీబీ అధికారులు తీసుకెళ్లారని డీఆర్‌డీఏ కార్యాలయ పర్యవేక్షకుడు శాస్త్రి, ఏఓ ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని వెంకటరెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కనీసం జెరాక్స్ కూడా తీసుకోకుండా ఫైళ్లన్నీ ఏసీబీ అధికారులకు ఇవ్వడం, రెండేళ్లుగా ఆయా ఫైళ్లకు సంబంధించి కంటిన్యూషన్ లేకపోవడంతో ఈ అక్రమాల వెనుక ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డీఆర్‌డీఏ అధికారులు కొత్త ఫైళ్లు తయారు చేసుకుని విధులు నిర్వర్తిస్తున్నారు.
 
 ఇప్పటి వరకు అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించినవి ఇవే..
 ఉపాధి కూలీలకు గడ్డపారలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం *3.50 కోట్లు మంజూరు చేసింది. అప్పటి పీడీ నీలకంఠం నాసిరకం గడ్డపారలు కొనుగోలు చేసి భారీ స్థాయిలో కమీషన్ తీసుకున్నారు. గడ్డపారలను ఐకేపీ సిబ్బంది ద్వారా కూలీలకు పంపిణీ చేశారు. అనంతరం ఐకేపీ సిబ్బంది కూలీల వద్ద గడ్డపారలను సగం రేటుకే కొనుగోలు చేశారు. వీటిని మరో గ్రామంలో విక్రయించి సుమారు కోటి రూపాయల వరకు అక్రమాలకు పాల్పడ్డారు. అప్పట్లో టీటీడీసీకి రోడ్డు వేయకుండానే వేసినట్లు చూపించి లక్షల రూపాయల దిగమింగారు. జిల్లా సమాఖ్య అనుమతులు లేకుండా పది వేల సెట్ల పుస్తకాలను ముద్రించారు. అయితే వీటి అవసరం లేకపోవడంతో చెదలుపట్టి నిధులు దుర్వినియోగమయ్యాయి.
 జిల్లా సమాఖ్యలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు వేల రూపాయలు లంచం తీసుకున్నట్లు గుర్తించారు. పీడీ నీలకంఠం తన ఇద్దరు కుమార్తెలకు తగిన విద్యార్హత లేకున్నా అక్రమంగా డీఆర్‌డీఏలో ఉద్యోగాలిచ్చారు. అప్పట్లో సదరమ్‌కు ఇన్‌చార్జిగా పని చేసిన డీఆర్‌డీఏ అధికారి పీడీతో కలిసి సుమారు *50 లక్షల వరకు అవినీతికి పాల్పడ్డారు. దీనిపై ప్రశ్నించిన వికలాంగుల సంఘాల నాయకులకు వ్యాన్ బహూకరించారు. దీంతోపాటు డీఆర్‌డీఏలో ఉద్యోగాలు కల్పించారు.
 
 అభయహస్తం ప్రారంభ దశలో కరపత్రాల ముద్రణ కోసం నిధులు దుర్వినియోగం చేశారు. వర్షాలకు కొన్ని కంప్యూటర్లు తడిశాయని చెప్పి..తడవని వాటినీ తడిసిన వాటి జాబితాలో చేర్చారు. దీంతో మళ్లీ కొత్త కంప్యూటర్లు కొనుగోలు చేశారు.
 
 స్వచ్ఛంద సంస్థల ముసుగులో కొన్ని సంస్థలు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు అనుమతులు మంజూరు చేయించుకున్నాయి. శిక్షణను కాగితాలకే పరిమితం చేసి అవినీతికి పాల్పడ్డాయి.
 ఈ అక్రమాల వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ, మానవ హక్కుల కమిషన్ విచారణ పేరుతో కాలయాపన చేశాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement