
ఇతడే ఒక సైన్యం
ఒంటిపై నాలుగు మూరల పంచె మాత్రమే ఉంటుంది. కాళ్లకు చెప్పులు వేసుకోడు.
రైతుల కోసం ఒంటరి పోరాటం
పెరిగిన బస్సుచార్జీ నుంచే అతని ఉద్యమం
విజయూ డెరుురీ తెరిస్తేనే చొక్కా ధరిస్తాడట !
చక్కెర ఫ్యాక్టరీ కోసం దీక్షబూనిన ఆదర్శ రైతు
ఒంటిపై నాలుగు మూరల పంచె మాత్రమే ఉంటుంది. కాళ్లకు చెప్పులు వేసుకోడు. కిలో మీటర్ల కొద్దీ నడిచేస్త్తుంటాడు. ఎండకు కాస్త నీడనిచ్చే తలపాగా ఉంటుంది. ఎవరి తలపై చేయి పెట్టడు. జనం సంక్షేమాన్ని ఆకాంక్షిస్తున్నాడు. కష్టంలో ఉన్న ప్రతి రైతు పంచన ఉంటాడు. సొంత పనులు పక్కన పెట్టి నలుగురి కోసం ఉద్యమిస్తున్నాడు. గల్లీ నుంచి రాజధాని వరకు దీక్షలు, ఉద్యమాలు చేస్తూ ఆదర్శ జీవితం గడుపుతున్నాడు. ఆయనే ఈదల వెంకటాచలం నాయుడు. ఈ రైతు ఉద్యమ గాథ ఆదివారం ప్రత్యేకం.
చిత్తూరు (అర్బన్): వెంకటాచలం నాయుడు స్వస్థలం పెనుమూరు మండలంలోని సాతంబాకం పంచాయతీ పెరుమాళ్ల కండ్రిగ. ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. పెద్దగా అక్షరజ్ఞానం లేదు. ఆరు ఎకరాల భూమి, నాలుగు ఆవులే ఆయన ప్రపంచం. పట్టుపురుగులు పెంచి పట్టుగూళ్లను అమ్మడం.. సేద్యం చేయడం తప్ప మరో లోకం తెలియదు. ఆవుల పాలను డెయిరీకి పోసి నెలసరి బిల్లులు తీసుకుని జీవనం సాగించేవాడు. ఒకటిన్నర దశాబ్దంగా జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అయినా సరే అన్నదాతకు కష్టమొస్తే ముందుంటాడు. ఆపదలో ఉన్న రైతుకు అండగా ఉంటాడు. నిరసన గళాన్ని విప్పుతాడు. ఆ నిరసన ఎలా ఉంటుందంటే రాజధానిలో ఏసీ గదుల్లో కూర్చున్న నేతలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తుంది.
2003లో ఓ సంఘటన వెంకటాచలంనాయుడులో ఉద్యమాన్ని మేల్కొలిపింది. చిత్తూరు నుంచి సాతంబాకం వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కాడు. రూ.5 ఇచ్చి టికెట్టు ఇమ్మన్నాడు. కండక్టర్ రూ.7 అడిగాడు. ఎందుకని అడిగితే చిత్తూరు నుంచి పెనుమూరు వెళ్లడానికి నాలుగు స్టేజీలు ఉండేవి. ఇప్పుడు ఐదో స్టేజీ పెరిగింది. అందుకే రూ.2 అదనంగా చెల్లించామని సమాధానమిచ్చాడు కండక్టర్. స్టేజీ ఇష్టప్రకారం పెంచేసి ప్రయాణికులపై భారం మోపడాన్ని నిరసిస్తూ ఆ ఏడాది జూన్‌లో దీక్షబూనాడు. పెనుమూరులోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట 16 రోజు ల పాటు వెంకటాచలం నాయుడు ఉద్యమం సాగింది. ఇదే సమస్యపై 2004లో 65 రోజులు, 2008లో 13 రోజుల పాటు దీక్షలు చేశాడు. సమస్య పరిష్కారం కాలేదు. కానీ ఆయన నిరసన మాత్రం కొనసాగుతూనే ఉంది. మరో ఉద్యమం దక్షిణాసియాలోనే ఒక వెలుగు వెలిగిన చిత్తూరు విజయా డెయిరీది. 2002లో అప్పటి పాలకవర్గం డెరుురీని మూసేయడంతో జిల్లాలోని లక్షలాది మంది రైతులు రోడ్డున పడ్డారు. నాయుడు లోలోపల మదనపడిపోయాడు. అన్నం మెతుకు గొంతులోకి వెళ్లక అడ్డం పడినట్లయింది జిల్లాలో రైతులు, విజయా డెయిరీ ఉద్యోగుల పరిస్థితి. 2004లో చిత్తూరుకు ఓ పనిపై వచ్చిన వెంకటాచల నాయుడు విజయా డెయిరీ వైపు వెళ్లాడు. డెరుురీని, అక్కడ ఉన్న యంత్రపరికరాలు చూసి చలించిపోయాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు విజయా డెయిరీని తెరిపించాలని నిరహారదీక్షలు, నిరవధిక దీక్షలు చేస్తూనే ఉన్నాడు. 2007 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు డెయిరీని పునః ప్రారంభించేత వరకు చొక్కా ధరించనని, కాళ్లకు చెప్పులు వేసుకోనని దీక్షబూనాడు. ఇప్పటికీ మొండి పట్టుదలతో అలాగే నడుస్తున్నాడు. పెనుమూరులోని కలవగుంట వద్ద ఉన్న ఎన్టీఆర్ జలాశయాన్ని శుభ్రం చేయించాలని 2008లో 18 రోజలు దీక్ష చేశాడు. డెరుురీ తెరిపించాలని గత నెలలో హైదరాబాద్ వె ళ్లి ఇందిరాపార్కు వద్ద 48 గంటల పాటు నిరసన దీక్షబూనాడు. చిత్తూరు సహకార చక్కర ఫ్యాక్టరీ యూజమాన్యం కార్మికులను తొలగించడమేగాకుండా, క్రషింగ్ ఆపేయడంపై ఫ్యాక్టరీ వద్ద ఉద్యమం చేస్తున్నాడు. ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించాలని, చెరకు రైతులకు, కార్మికులకు బకారుులు చెల్లించాలనే డిమాండ్‌తో 20 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నాడు.
వెంకటాచలం నాయుడు పెద్ద కుమారుడు మేస్త్రీ పనిచేసి జీవిస్తున్నాడు. పాల డబ్బులు, పొలంలో ఆదాయంతో కుమార్తెకు పెళ్లిచేశాడు. మరో కొడుకును ఇంజినీరింగ్ చదివిస్తున్నాడు. ఉద్యమాల బాట పట్టడంతో ఇల్లు గడవడానికి, ఊర్లు తిరగడానికి ఆరెకరాల పొలంలో ఓ ఎకరం అమ్మేశాడు. అయినా సరే ఉద్యమాలకు ఎవరినీ ఆర్థిక సాయం అడగనని, ఇచ్చినా తీసుకోనని, ఆత్మాభిమానాన్ని చంపుకోలేనని చెబుతున్నాడు వెంకటాచలం నాయుడు.