నెల్లూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థినిని... సహ విద్యార్థి హతమార్చి, చెరువులోకి తోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వల్లూరు తిరుమలకుమార్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే అల్లూరుకు చెందిన స్వప్నప్రియ కావలిలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్న సమయంలో బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన తిరుమలకుమార్ ను ప్రేమించింది. అతడికి చాలాసార్లు డబ్బు సాయం కూడా చేసింది. ఒకసారి తన బంగారు గొలసును కూడా అతడికి ఇచ్చింది. అయితే వీరి ప్రేమను స్వప్న తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఆమెకు తల్లిదండ్రులు వేరే సంబంధం చూశారు. ఈనెల 14న వివాహం నిశ్చయించారు.
కాగా మూడు రోజుల క్రితం తిరుమలతో కలిసి బయటకు వెళ్లిన స్వప్న...అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. దాంతో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మరోవైపు అల్లూరు చెరువులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్య జరిగి సుమారు 48 గంటలకు పైగానే అయి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
మృతురాలి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడనే అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్మార్టంకు తరలించారు. కూతురుకి బంగారు భవిష్యత్ కోసం రైతు అయిన స్వప్న తండ్రి కష్టపడి ఆమెను బీటెక్ చదివించినట్లు తెలుస్తోంది.