బలపడనున్న అల్పపీడనం
* ఏపీ, తెలంగాణల్లో వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి అనుకుని ఏర్పడిన అల్పపీడన ప్రాంతం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి ఉపరితల ఆవర్తనం తోడైంది. అల్పపీడనం బలపడనుందని భారత వాతావరణ విభాగం బుధవారం రాత్రి తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంట ల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల మోస్తరు వర్షాలుగానీ, ఉరుములతో కూడిన జల్లులు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
అదే సమయంలో ఉత్తర కోస్తా, తెలంగాణల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులుగానీ, వర్షాలు కురవవచ్చని పేర్కొంది. గడచిన 24 గంటల్లో గూడూరు, సూళ్లూరుపేటల్లో 3 సెం.మీలు, శ్రీహరికోట, అశ్వారావుపేటల్లో 2 సెం.మీ.లు, తడలో 1 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
తిరుమలను ముంచెత్తిన వర్షం
సాక్షి, తిరుమల: తిరుమలలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది. ఫలితంగా ఆలయం వద్ద వర్షం నీరు నిలిచింది. శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు తడిసిముద్దయ్యారు. వర్షం వల్ల తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే రెండో ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అదనపు సిబ్బందిని నియమించి పడిన రాళ్లను పడినట్టుగా తొలగించారు. వర్షం వల్ల తిరుమలలో చలి పెరిగింది.