పుణ్యకాలంలో పాపకార్యం
పుణ్యకాలంలో పాపకార్యం
Published Wed, Jul 27 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
పుష్కరాల భక్తుల కోసం
తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు
నాసిరకంగా మరుగుదొడ్లు నిర్మించిన కాంట్రాక్టర్
పెనమలూరు :
మండలంలో పుష్కరాల పనులు ఫార్సుగా మారాయి. తాజాగా మరుగుదొడ్ల అద్దె బాగోతం వెలుగులోకి వచ్చింది. పచ్చనేతల అండదండటతో మరుగుదొడ్లనూ వదలకుండా కాసులు దండుకునే పనిలో పడ్డారు కాంట్రాక్టర్లు. పుష్కరాలకు అద్దె మరుగుదొడ్లు ఏర్పాటు చేసి రూ.11 లక్షలు స్వాహాకు చేసేందుకు ముందస్తు ప్రణాళిక వేశారు. పెనమలూరు మండలంలో యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం, కాసరనేనివారిపాలెం గ్రామాల్లో ఘాట్‌లు ఉన్నాయి. పుష్కరాల యాత్రికుల కోసం ప్రభుత్వం మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించింది. దీని కోసం టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టింది.
అద్దె డబ్బుతో శాశ్వతంగా నిర్మించొచ్చు
పుష్కర ఘాట్‌ల వద్ద కాంట్రాక్టర్ తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో మరుగుదొడ్డికి రోజుకు అద్దె రూ 2200. పెనమలూరు మండలంలో యనమలకుదురులో 20 మరుగుదొడ్లు, పెదపులిపాకలో 10, చోడవరంలో 10, కాసరనేనివారిపాలెంలో నాలుగు కలిపి మొత్తం 44 మరుగుదొడ్లు నిర్మించారు. ఈ మరుగుదొడ్లకు 44 రోజులకుగాను అద్దె రూ.11,61,600. ఈ లెక్కన ఒక్కో మరుగుదొడ్డికి రూ 26,400 ప్రభుత్వం చెల్లించాలి. విజయవాడ నగరంలో ఏసీ గది రోజుకు రూ.1500 ఉంటుంది. కానీ తాత్కాలిక మరుగుదొడ్డి అద్దె మాత్రం దీనికంటే ఎక్కువ. దీన్ని చూసిన వారు పుష్కరాల పనులనూ అక్రమార్కులు వదలడం లేదని విమర్శిస్తున్నారు. వాస్తవంగా అద్దె బదులుగా ఈ సొమ్ముతో ఇక్కడ సామూహిక మరుగుదొడ్లు నిర్మించవచ్చు.
గాలి వస్తే పడడం ఖాయం
కాంట్రాక్టర్ ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు ఇరుకుగా చిన్నపాటి గాలి వస్తే పడిపోయేలా ఉన్నాయి. కేవలం రేకులతో సన్నని ఇనుక కమ్మెలతో వీటిని నిర్మించారు. భారీ ఖాయంగల వ్యక్తులు ఈ మరుగుదొడ్డిలోకి వెళ్లడం కష్టమే. తాత్కాలిక మరుగుదొడ్లకు పైకప్పు లేదు. వర్షం కురిస్తే భక్తుల ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఇలాంటి వారికి లక్షల రూపాలయ అద్దె చెల్లించడం ఎంత వరకు సమంజసమో ప్రభుత్వమే చెప్పాలి.
Advertisement
Advertisement