మంత్రి ఆదినారాయణరెడ్డి (ఫైల్ ఫొటో)
సాక్షి ప్రతినిధి కడప : కేబినెట్‌లో చేరి ఏడాది గడిచిందో లేదో అప్పుడే మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబంలో లుకలుకలు మొదలయ్యాయి. రాజకీయ పెత్తనమంతా భార్య తరఫు బంధువులకు అప్పచెబుతుండటాన్ని సొంత అన్నదమ్ములు జీర్ణించుకోలేకపోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. మొదటి నుంచి కష్టనష్టాల్లో అండగా నిలిచిన తమను మంత్రి పీఠం అధిష్టించగానే దూరం పెట్టడంపై వీరు గత కొంతకాలంగా గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇంటి వద్ద మాట, పలుకరింపు వ్యవహారం ఎలా ఉన్న బయట ప్రజలకు కనిపించే కార్యక్రమాల్లో సైతం వీరు మంత్రితో పాటు పాల్గొనడం లేదు.
అన్నదమ్ములను దూరం జరిపి..
సరిగ్గా ఏడాది క్రితం ఉహించని విధంగా మంత్రి పదవి అందిపుచ్చుకున్న ఆదికి తర్వాత స్వార్థపూరిత ఆలోచనలు ఎక్కువయ్యాని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తన కుమారుడు, కుమార్తె భార్య తరఫు బంధువులకే అధిక ప్రాధాన్యమిస్తూ, అంతకంటే దగ్గర వారిని దూరం పెట్టాడని అతని వర్గీయులే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ పెత్తనమంతా తన తోడల్లుడు, మామలకే కట్టబెట్టడం ఆరోపణలను బలపరుస్తోంది. దీనికి తోడు ఇన్నాళ్లు రాజకీయాల్లో తనకు సహకరించిన అన్నదమ్ములను ఇటీవల దూరం జరపడం, వీరు స్థానిక రాజకీయ వ్యవహారాల్లో పూర్తిగా పక్కన పెట్టడం ఈ విమర్శలకు బలం చేకూర్చుతుంది.
రాజకీయ వారసుడి విషయంలో...
దేవగుడి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న దేవగుడి శంకర్‌రెడ్డి 1990లో జరిగిన ఫ్యాక్షన్ తగాదాల్లో హత్య గురైన అనంతరం కుటుంబ బాధ్యతలను నారాయణరెడ్డి నెత్తికెత్తుకున్నారు. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు సార్లు పోటీ చేసిన నారాయణరెడ్డి 1994 ఎన్నికల్లో పది వేల ఓట్ల తేడాతో, 1999 ఎన్నికల్లో కేవలం 300 ఓట్ల తేడాతో ఓటమి చవి చూసిన విషయం విదితమే. 2004లో రాష్ట్రమంతా వైఎస్సార్ గాలి వీస్తున్న తరణంలో జమ్మలమడుగులో దేవగుడి నారాయణరెడి గెలుపు నల్లేరు మీద నడకే అని అందరు భావించారు. అలాంటి సమయంలో కేవలం ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన సొదరుడు ఆది నారాయణరెడ్డిని రంగంలోకి దించారు.
నాటి నుంచి నేటి వరకు ఆది తన గెలుపు పరంపరను కొనసాగించారు. ఇలా తనకు రాజకీయ అవకాశం కల్పించిన అన్న నారాయణరెడ్డి రుణం తీర్చుకునే దానిలో భాగంగా ఆయన కుమారుడు భూపేష్‌రెడ్డిని తన రాజకీయ వారసుడిగా ఆది ప్రకటిస్తూ వచ్చారు. అయితే మంత్రి అయిన తర్వాత ఆది చర్యలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉండటమే కాకుండా తన సొంత కుమారుడు సుధీర్‌రెడ్డిని రాజకీయంగా పైకి తీసుకుని వస్తుండటం అన్నదమ్ముల మధ్య గ్యాప్‌నకు కారణమైంది.
హామీని పక్కకు తోసి...
తొలుత నోరు జారడం, ఆ తర్వాత మాటపై నిలబడలేకపోవడం ఆదికి మామూలే అయినప్పటికి భూపేష్‌ను తన రాజకీయ వారసుడిగా కార్యకర్తల సమావేశంలో పలుమార్లు ప్రకటిస్తూ వచ్చారు. అయితే అనుకోని విధంగా మంత్రి అయిన ఆది ఆ తర్వాత భూపేష్‌ను దూరంపెడుతూ వచ్చాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన కుమారుడు సుధీర్‌రెడ్డికి జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పదవిని ఇప్పించుకునే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఈ విషయంలో తన చిరకాల ప్రత్యర్థి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గం నుంచి అవరోధాలు ఎదురైనప్పటికి పట్టుబట్టి మరి తన కుమారుడు సుధీర్‌రెడ్డికి పదవి ఇప్పించుకోగలిగారు.
ఆదిపై అంతులేని అసమ్మతి
రెండేళ్ల క్రితం ఆయన వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లే సమయంలో అన్నదమ్ములందరినీ ఏకం చేసి సీఎం వద్ద తన బలగాన్ని ప్రదర్శించారు. అప్పట్లో అన్నదమ్ములకు ఇచ్చిన హామీలను మరచి నాటి నుంచి నేటి వరకు వీరిని ఒక్కసారి కూడా సీఎంతో భేటి చేయించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్గతంగా అసమ్మతిని వ్యక్తం చేస్తున్న అన్నదమ్ములు కొంతలంగా మంత్రి కార్యక్రమాలకు హాజరు కావడం లేదన్నది జగమెరిగిన సత్యం.
తాజాగా మైలవరం జలాశయం గేట్లు ఎత్తే సమయంలో కూడా మైలవరం జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న భూపేష్‌రెడ్డి గైర్హాజరు కావడం వారి మధ్య చోటుచేసుకుంటున్న విభేదాలకు బలం చేకూర్చుతుంది. తన కుమారుడి పదవి విషయంలో శక్తి మేర పోరాడిన ఆది తన అన్నదమ్ములు, వారి కుమారుల సమస్యల విషయం వచ్చే సరికి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న వాస్తవం వారిని మరింత కుంగదీసిందని చెప్పవచ్చు. ఈ కలహాలు ఇలాగే కొనసాగితే మరి కొద్దిరోజుల్లోనే కుటుంబసభ్యులు బహిరంగంగానే తిరుగుబాటు జెండా ఎగురవేసే పరిస్థితి కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment