
నిజాం లౌకికవాదా... విడ్డూరం: వెంకయ్యనాయుడు
శాసన సభలో నిజాంను లౌకికవాది అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీర్తించడం విడ్డూరంగా ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. నిజాం పాలనలో రజాకార్ల సృష్టించిన అరచకాలను సభలో ఎందుకు ప్రస్తావించలేదని అక్బరుద్దీన్ ను వెంకయ్య ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికే తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన సుస్పష్టం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన తమ పార్టీ కార్యవర్గ సమావేశాలలో చేసిన ప్రసంగంపై దేశవ్యాప్తంగా చర్చ జరపాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పై వెంకయ్య నాయుడు విమర్శలు సంధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలు మాత్రమే చేయగలదని , పరిపాలన చేతకాదని వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. గతంలో ఆప్ను ఆకాశానికి ఎత్తిన వారే నేడు వ్యతిరేకిస్తున్నారని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ టి. బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో సోమవారం సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధి అంతా నిజాం పాలనలో జరిగిందని అక్బరుద్దీన్ కీర్తించారు. అలాగే నిజాం నిజమైన లౌకికవాది అని పేర్కొన్న నేపథ్యంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు వెంకయ్యనాయుడుపై విధంగా స్పందించారు.