
మాచర్ల: ‘చంద్రబాబూ.. నీ బినామీలపై ఐటీ దాడులు జరిగితే అవి రాష్ట్రం మీద దాడులా? ఎంపీ సీఎం రమేష్‌కు 2014కు ముందు ఎన్ని ఆస్తులున్నాయి? ఈరోజు రూ.వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ బినామీగా వ్యవహరించిన రమేష్‌పై దాడులు జరిగితే అది రాష్ట్రంపై దాడిగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంతటి దిగజారుడు రాజకీయాలు ఇంకా ఎన్నాళ్లు చేస్తావు?’ అని వైఎస్సార్‌సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మాచర్లలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఐటీ దాడులు జరగటానికి కారణం టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతేనని చెప్పారు. ఎన్నికల ముందు అఫిడవిట్‌లో ఇచ్చిన ఆస్తులకు, నాలుగేళ్లుగా సంపాదించిన ఆస్తులకు వందల కోట్ల తేడాలు ఉండటంతో ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు.
అసలు పెట్టుబడులు పెట్టలేని సంస్థలు కోట్ల రూపాయలను సంపాదిస్తుంటే ఐటీ వాళ్లు ఎందుకు దాడులు చేయరని ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులపై దాడులు చేయటం సహజమన్నారు. ఐటీ దాడుల నుంచి తప్పించుకోవటానికి అధికార పార్టీ నాయకులు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద జల్లుతూ ఆరోపణలు చేయటం హాస్యాస్పదమన్నారు. ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా అక్రమాలు బయటకు రాక తప్పవని, అక్రమంగా ఆస్తులు సంపాదించిన టీడీపీ నేతలంతా శిక్షకు గురై ప్రజల చేత కూడా బుద్ధి చెప్పించుకునే పరిస్థితి త్వరలోనే రానుందని ఎమ్మెల్యే పీఆర్కే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment