పంజాగుట్ట (హైదరాబాద్) : హక్కుల సాధనకు ఈ నెల 29వ తేదీ నుండి తెలంగాణ ఓ.సి. పేదల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 'మహా పాదయాత్ర' నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. పాదయాత్ర ఈ నెల 29న హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ప్రారంభమై మేడ్చల్, తూప్రాన్, చేగుంట, చిన్నశంకరంపేట, మెదక్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, బాన్సువాడ మీదుగా నిజామాబాద్‌లోని బాసరలో జూన్ 11వ తేదీన ముగుస్తుందని తెలిపారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని.. రెడ్డి, చౌదరి, వెలమ, బ్రాహ్మణ కులాలలో కూడా ఎంతో మంది నిరుపేదలుగా బతుకుతున్నారని తెలిపారు.
వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఎంతో మంది తమ పిల్లలను కష్టపడి చదివించుకున్నా రిజర్వేషన్లు లేక ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోతున్నారన్నారు. రిజర్వేషన్ల వల్ల మెరిట్‌ను అణగదొక్కుతున్నారని, ఈ ధోరణి దేశానికి ఎంతో నష్టమని పేర్కొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం పాదయాత్ర అనంతరం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో యాత్రకు సంబంధించిన పోస్టర్, సీడీలను హనుమాన్ చౌదరి, తెలంగాణ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, తెలంగాణ ఓ.సి. పేదల సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంతోష్ రెడ్డి, దక్షిణామూర్తి, తెలంగాణ విద్యాసంస్థల ఐక్య వేదిక చైర్మన్ నల్లా భాస్కర్ రెడ్డి, వెంకట శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు.
హక్కుల సాధనకు ఓసీల "మహా పాదయాత్ర"
Published Wed, May 20 2015 2:59 PM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement
Advertisement