నిలిచిపోయిన మా ఇంటి మహాలక్ష్మి వెబ్‌సైట్
ఆడపిల్లలు భారమని భావించేవారి వారి ఇంట్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో 2013 మే ఒకటో తేదీన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బంగారు తల్లి పథకానికి శ్రీకారం చుట్టింది. 2014లో కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం ఆరు నెలల తర్వాత ఈ పథకానికి మా ఇంటి మహా లక్ష్మిగా పేరు మార్చింది. అయితే పేరు మార్చేందుకు చూపించిన ఉత్సాహం పథకం అమలుపై మాత్రం చూపించలేకపోయింది. ఫలితంగా ఈ పథకం ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు దరఖాస్తులు స్వీకరించడం లేదు. గతంలో చేసుకున్నవారికి అతీగతీ లేదు. మూడున్నరేళ్లుగా ఈ పథకాన్ని చంద్రబాబు సర్కార్ పూర్తిగా మరిచిపోయింది. రూపాయి కూడా నిధులు విదల్చలేదు. చివరి బడ్జెట్‌లో సైతం ఈ పథకం గురించి కనీస ప్రస్తావన లేదు.
వీరఘట్టం: మాఇంటి మహాలక్ష్మి పథకాన్ని పకడ్బందీగా కొనసాగిస్తామని గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడేమో పూర్తిగా మంగళం పలికింది. ఇంత వరకు ఈ పథకానికి సంబంధించి ఎటువంటి విధివిధానాలను సైతం ప్రకటించలేకపోయింది. మూడున్నరేళ్లుగా మూగబోయిన పథకాన్ని కొనసాగిస్తామని కళ్లబొల్లి ప్రకటనలు చేస్తున్నారే తప్ప, ఆచరణకు నోచుకోకపోవడంపై ప్రజలు, మహిళలు మండిపడుతున్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్‌లో కూడా ఈ పథకానికి నిధులు కేటాయించలేదంటే మహిళలు, చిన్న పిల్లల పట్ల టీడీపీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది.
పథకం ప్రయోజనాలు
దరఖాస్తు చేసుకున్న ఆడపిల్లలకు జనన నమోదు సమయంలోనే రూ.2500 చెల్లిస్తారు. ఇలా రెండేళ్ల వరకు ఇస్తారు. 3 నుంచి 5 ఏళ్ల లోపు వారికి అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా ఏటా రూ.1500 చెల్లించాలి.· 6 నుంచి 10 ఏళ్ల వరకు ఏటా ప్రభుత్వ పాఠశాలల ద్వారా 2 వేలు ఇవ్వాలి. 11 నుంచి 13 ఏళ్ల వరకు 6, 7 తరగతి చదివే సమయంలో ఏటా రూ. 2,500 చెల్లించాలి. 14 నుంచి 15 ఏళ్ల లోపు వారికి ఏటా రూ.3,500, 16 నుంచి 17 ఏళ్ల వరకు ఇంటర్ చదివే సమయంలో ఏటా రూ.3,500, 18 నుంచి 21 ఏళ్ల వరకు ఏటా రూ.4 వేలు, 21 ఏళ్లు వచ్చిన అనంతరం ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధిస్తే రూ.5 వేలు, డిగ్రీ పూర్తి చేస్తే రూ.1,55,500 అందించాలి.
విధివిధానాల్లేక..
మా ఇంటి మహాలక్ష్మి పథకం సర్కార్ తీరు కారణంగా మూడున్నరేళ్లుగా నిలిచిపోయింది. లబ్ధిదారులకు పైసా కూడా ఇప్పటి వరకూ విదల్చలేదు. 2013 నుంచి ఈ పథకాన్ని ఇందిరక్రాంతి పథం (వెలుగు) శాఖ కార్యాలయం అధికారులు నిర్వహించేవారు. తర్వాత ఈ శాఖ నుంచి స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు పథకాన్ని బదలాయించారు. వెలుగు శాఖ కార్యాలయంలోని కంప్యూటర్‌లో ఉన్న దరఖాస్తులను తొలగించారు. ఐసీడీఎస్ శాఖకు దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ఎలాంటి విధివిధానాలు ప్రకటించలేదు. ఫలితంగా జిల్లాలోని ఆడపిల్లల తల్లిదండ్రులు అర్జీలు ఎవరికి ఇవ్వాలో తెలియక సతమతమవుతున్నారు. రెండు శాఖల వారు దరఖాస్తులు స్వీకరించకపోవడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఈ పథకానికి ఎటువంటి నిధులను చివరి బడ్జెట్‌లో కేటాయించకపోవడంతో ఈ పథకంపై లబ్ధిదారులు ఆశలు వదులుకుంటున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇలా..
2013లో ప్రారంభమైన మా ఇంటి మహాలక్ష్మి పథకానికి జిల్లాలో 15,986 మంది మహిళలు «ఇంత వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 14,698 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. ఇందులో 14,707 మందికి 3,66,42,500 రూపాయలను మొదటి ఏడాది కేటాయించారు. ఇందులో ఒకొక్కరికీ రూ.2,500 చొప్పున చెల్లించారు. 2014 నుంచి పథకం నిలిచిపోయింది. కాగా..గత మూడున్నరేళ్ల నుంచి జిల్లాలో సుమారు 25 వేల మంది ఆడపిల్లలు జన్మించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్ నిలిచిపోయిందని అధికారులు చెబుతుండడంతో నిరాశతో వెనుదిరిగారు.
కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా
మా ఇంటి మహాలక్ష్మి పథకానికి 2013లో దరఖాస్తు చేసుకున్నాను. రెండు నెలల తరువాత రూ.2500 ఇచ్చారు. బాండు ఇవ్వలేదు. అధికారులకు అడిగితే ఈ పథకం నిలిచిపోయిందంటున్నారు.
– బి.లక్ష్మీభారతి, వీరఘట్టం
Comments
Please login to add a commentAdd a comment