
బెజవాడలో '1 నేనొక్కడినే' పైరసీ సీడీలు!
విజయవాడ : హీరో మహేష్ బాబు తాజా చిత్రం 1 నేనొక్కడినే' పైరసీ సీడీలు బెజవాడలో హల్చల్ చేస్తున్నాయి. విజయవాడ, కృష్ణాజిల్లా చుట్టుపక్కల ఈ చిత్రం పైరసీ సీడీలు విచ్చలవిడిగా మార్కెట్లో లభ్యం అవుతున్నట్లు సమాచారం. మరోవైపు ఆదివారం విడుదలైన రామ్ చరణ్ 'ఎవడు' చిత్రం పైరసీ సీడీలను ఈరోజు రాత్రి మార్కెట్లోకి విడుదల చేసేందుకు పైరసీ మాఫీయా రంగం సిద్ధం చేసింది.
ఇందుకు సంబంధించి డౌన్లింక్ పాస్వర్డ్ను విడుదల చేసింది. కాగా ఈ పైరసీకి జిల్లాకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇతనికి చిత్రపరిశ్రమలోని పెద్దల సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పైరసీ సీడీలపై నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా విడుదలకు ముందే సీడీల రూపంలో బయటకు వచ్చిన విషయం తెలిసిందే.