నేడు సమైక్య తీర్మానం చేయండి | Make a united resolution today | Sakshi
Sakshi News home page

నేడు సమైక్య తీర్మానం చేయండి

Published Fri, Nov 1 2013 3:51 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

Make a united resolution today

అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని పంచాయతీలలోనూ సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ తీర్మానం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ సర్పంచులకు పిలుపునిచ్చారు. తీర్మాన ప్రతులను ప్రధానితోపాటు గ్రూప్ ఆఫ్ మినిస్టర్‌‌స (జీఓఎం)కు ఫ్యాక్స్‌ద్వారా పంపించాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన పార్టీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ర్టం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నేడు సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానాలు చేసేందుకు సర్పంచులందరూ పార్టీలకతీతంగా ముందుకు రావాలని కోరారు.
 
 రాష్ర్ట విభజనకు పూనుకున్న సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్, ఆంటోని, కేసీఆర్ దిష్టిబొమ్మలను నరకచతుర్దశి రోజున దహనం చేస్తామన్నారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల 6, 7న చేపట్టబోయే ర హదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుజాతిని పరిరక్షించుకునేందుకు ప్రజలందరూ సహకరించాలన్నారు. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ విజయవంతం కావడంతో కేంద్రంపై ఒత్తిడి వచ్చిందని వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. రాష్ర్ట విభజనపై సుప్రీం కోర్టుకెళతామని, అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని అంటున్న టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్  మొదట అఖిలపక్షంలో తమ వైఖరేంటో తెలపాలని డిమాండ్ చేశారు.
 
 ప్రజలను మభ్యపెట్టే విధానాలను టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా మానుకుంటే బాగుంటుందని హితవు పలికారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి షరతులు లేని బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమం మరింత ముందుకు పోతుందని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తిప్పేస్వామి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్‌పీరా, పార్టీ నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, నాయకులు చుక్కలూరు దిలీప్ రెడ్డి, వెన్నపూస రామచంద్రారెడ్డి, కోటి వెంకటేశ్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement