విశాఖ : ప్రజలకిచ్చిన వాగ్ధానాలు, ఇచ్చిన హమీలను గాలికొదిలేసిన పాలకపక్షంపై ప్రతిపక్షం పోరుబాటకు సిద్దమైంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు, నిరసనలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. విశాఖ కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పిలుపుకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజాపక్షంగా పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మరోసారి ఉద్యమబాటకు శ్రీకారం చుట్టింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి ఆరునెలలవుతున్నా ప్రజలకిచ్చిన ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకపోవడంపై ప్రతిపక్షం మండిపడుతోంది. తెలుగుదేశం నేతలు రోజుకో కట్టుకధ, పూటకో పిట్టకధ చెబుతూ ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు దగాలు...జనం దిగాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ నేతలు డిసెంబర్ 5న జరిగే మహధర్నాకు సంబంధించిన పోస్టర్లను ఆన్ని జిల్లాల్లో ఇప్పటికే విడుదల చేశారు. మాట తప్పిన ప్రభుత్వం చేస్తున్న వంచనలు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఈ ధర్నాలు, నిరసనల కార్యక్రమం కొనసాగుతోందని వైఎస్ జగన్ చెప్పిన విషయం తెలిసిందే.
మొదటి ఐదు సంతకాలతో స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానంటూ ప్రజల సాక్షిగా చేసిన ప్రమాణాలు ఇప్పుడేమయ్యాయని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, చేనేత కార్మికులు, నిరుద్యోగులు, పింఛన్‌లు కోల్పోయిన లబ్ధిదారులు ఇలా ఒకటేమిటి అన్ని వర్గాల ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని పార్టీ నేతలు తెలిపారు.
ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజాగ్రహం ఏ స్ధాయిలో చాటి చెప్పింది. అయితే ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా రాకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలకు సిద్దమయ్యారు.
మరోసారి ఉద్యమబాటకు వైఎస్ఆర్ సీపీ శ్రీకారం
Published Thu, Dec 4 2014 8:21 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement