
సాక్షి, విశాఖ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘వంచన వ్యతిరేక’ దీక్ష ముగిసింది. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలు, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయని బీజేపీ దగాకోరు వైఖరికి నిరసనగా విశాఖపట్నం వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం భారీ ఎత్తున తలపెట్టిన ‘వంచన వ్యతిరేక దీక్ష’ విజయవంతమైంది. ఈ దీక్షను కొద్దిసేపటి క్రితం విరమించారు.
12 గంటల పాటు దీక్షలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులకు చిన్నారులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. దీక్షకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించారు. అలాగే స్థానికులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి బీజేపీ, టీడీపీ మోసాలను ఎండగట్టారు. ఈ దీక్షలో హోదా కోసం రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీలతో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు.
ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వైఎస్సాఆర్ సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్‌తో పాటు రాష్ట్ర ప్రజలు నాలుగేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోకుండా మౌనంగా ఉంటూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు హోదా కోసం ‘ధర్మ పోరాటం’ అంటూ తిరుపతిలో దీక్షకు పూనుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి తామంతా ముందుంటామని, కేంద్రం ఇచ్చిన ప్రతి హామీ అమలు కోసం తుదికంటా పోరాడతామని వైఎస్సాఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబు దీక్షలకు పూనుకోవడం అధికారం కోసం వేస్తున్న ఎత్తుగడలే తప్ప మరొకటి కాదని పార్టీ నేతలు ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment