
వణికిస్తున్న మలేరియా
ఏజెన్సీలో కసిగా మలేరియా కోరలు చాస్తోంది. నిరుడీ రోజుల్లో నమోదైన కేసుల సంఖ్యను తలదన్నేలా ఈ రోగం జాడలు కనిపిస్తున్నాయి.
రోజురోజుకు ఉధృతం మంచానపడి వందలాది
మంది విలవిల ఐదేళ్ల తర్వాత పరిస్థితి ఆందోళనకరం
కొత్తపొలంలో దయనీయం
ఏజెన్సీలో కసిగా మలేరియా కోరలు చాస్తోంది. నిరుడీ రోజుల్లో నమోదైన కేసుల సంఖ్యను తలదన్నేలా ఈ రోగం జాడలు కనిపిస్తున్నాయి. వందలాది మంది మంచానపడి లేవలేని స్థితిలో అల్లాడిపోతున్నారు. రోజు రోజుకు ఇది ఉధృతమవుతోంది. అనంతగిరి, భీమవరం, పినకోట, దారకొండ, గన్నెల, ముంచంగిపుట్టు, రూఢకోట, ఆర్జేపాలెం, గోమంగి పీహెచ్‌సీల పరిధిలో మలేరియా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 2,10,542 మంది జ్వరపీడితులకు రక్తపరీక్షలు నిర్వహించగా 4,405 మందికి మలేరియా పాజిటివ్‌గా నిర్ధారించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మలేరియా ఉధృతంగా ఉన్నట్టు వెల్లడవుతోంది. మలేరియా కారకమైన దోమల నియంత్రణకు పిచికారీ పనులు చేపట్టినప్పటికీ అది అదుపుకాని పరిస్థితి. ఏజెన్సీలో ఐదేళ్ల కిందట ప్రతి కుటుంబానికి దోమ తెరల పంపిణీ చేశారు. అనంతరం వాటి గురించి మరిచిపోయారు. పీహెచ్‌సీల పరిధిలో సిబ్బంది కొరత కూడా ఉంది. మొత్తంగా మలేరియా నియంత్రణ అదుపుతప్పింది.
పాడేరు రూరల్ : మండలంలోని వంట్లమామిడి పంచాయతీ మారుమూల కొత్తపొలం గ్రామంలో ఇంటింటా జ్వరాలు ఉన్నాయి. వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నా తగ్గుముఖం పట్టడం లేదు. గ్రామంలో డుంబేరి బాలన్నకు రక్త పరీక్షలు నిర్వహించగా మలేరియాగా నిర్ధారణ అయింది. వంతాల సత్తిబాబు డయేరియాతో వంతాల రమేష్, కొర్రా అర్సో , వాంతల బంగారమ్మ , కాసులమ్మ , వంతాల స్వాతీ , పంది చిన్నబాయి , ఆర్.చిన్నబ్బాయి, పాంగి బాలన్న , వంతాల గున్న , గెమ్మెలి బాలన్న లు విష జ్వరాలకు గురుయ్యారు. ఆశ కార్యకర్త వద్ద పూర్తి స్థాయిలో మందులు లేవు. కేవలం పారసిట్‌మాల్, ఐరన్, మెట్రజోల్, క్లోరోక్విన్ మాత్రలే ఉన్నాయి.
బిళ్లలేసుకున్నా.. ఫలితం లేదు
చింతపల్లి: మండలంలోని బయలుకిం చంగి, చౌటపాడు గ్రామాల్లో మలేరియా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి బైలు కించంగిలో కాకరి అప్పారావు, కాకరి స్వాతి, కాకరి అరుణ, కాకరి చిట్టిబాబులతోపాటు మరికొంత మంది మంచానపడ్డారు. వీరిలో పలువురికి మలేరియాగా చింతపల్లి కమ్యూనిటీ ఆస్పత్రిలో నిర్ధారణ జరిగింది. మలేరియా బాధితులకు గతంలో క్లోరోక్విన్ మాత్రలు వేసుకుంటే నయమయ్యేది. 40 ఏళ్లుగా ఇదే మందును వినియోగిస్తుండటంతో బాధితులలో బాక్టీరియా పూర్తిగా నశించడం లేదని చింతపల్లి డిప్యూటీ డీఎంహెచ్‌వో కేవీఎస్ శర్మ తెలిపారు. దీంతో ఏసీటీ అనే సరికొత్త మందులను వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు.
ఐదేళ్ల తరువాత మళ్లీ..
జీకేవీధి: మండలంలోని నిమ్మపాడులో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ గ్రామంలో శుక్రవారం సాక్షి సందర్శించగా ఇంటింటా జ్వరబాధితులు ఉన్నారు. ఈ ఏడాది మొదటి, రెండవ విడత పిచికారీ పనులు చేపట్టకపోవడం, అలాగే దోమ తెరల వాడకం లేకపోవడంతో వ్యాధులు ప్రబలాయి. మండలంలోని జీకేవీధి, ఆర్వీనగర్, జర్రెల, పెదవలస, దారకొండ, సీలేరు, సప్పర్ల పీహెచ్‌సీల్లో ఈ ఏడాది జనవరి 15 నుంచి జూన్ 10 వరకు 685 మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదేళ్ళ క్రితం ఇంత ఎక్కువగా వచ్చింది. ఆ తరువాతే ఈ ఏడాదే మలేరియా విజృంభిస్తున్నది.
మలేరియాతో మంచాన...
జి.మాడుగుల: గెమ్మెలి పీహెచ్‌సీ పరిధిలో 60 మంది మలేరియాతో బాధపడుతున్నారు. జి.మాడుగుల పీహెచ్‌సీ పరిధిలో 24 మలేరియా కేసులు నమోదయ్యాయి. మరికొందరిని విషజ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. వై.బి.గొందూరులో తుర్రే కొండలరావు, సుశీల, మత్స్యలింగం రెండు రోజుల నుంచి జ్వరాలతో బాధపడుతున్నారు. వైద్య సిబ్బంది రక్తపూతలు తీసి సేవలు అందించినా తగ్గలేదని అంటున్నారు. గెమ్మెలి పీహెచ్‌సీ పరిధిలో పలు గ్రామాల్లో గిరిజనులు జ్వరాలు తదితర వ్యాధులతో బాధపడుతున్నారు.