కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న భార్గవిని పరామర్శిస్తున్న మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్
పిల్లల ప్రేమను పెద్దలు గౌరవించారు. వివాహం చేసేందుకు సమ్మతించారు. నవంబర్ 11న పెళ్లికి ముహూర్తం కూడా పెట్టారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే చూడముచ్చటైన జంటగా వీరిద్దరూ కొత్త కాపురంలోకి అడుగుపెట్టాల్సి ఉంది. ఇంతలో ఘోరం జరిగింది. ప్రేమ కత్తిగట్టింది. అనుమానం ఆవేశమైంది. ఆవేశం ప్రేమోన్మాదిగా మార్చింది. ప్రాణ సమానంగా ప్రేమించిన అమ్మాయిపై కత్తితో దాడికి పాల్పడేలా చేసింది. ఎందుకింత కక్ష. ఇలాంటి పనికి ఎందుకు యత్నించా డు ఆ యువకుడు.. ఈ ప్రశ్నలే అనకాపల్లివాసుల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.
సాక్షి, అనకాపల్లి: పట్టణంలోని భీమునిగుమ్మం అంటే ఒక ప్రత్యేకత. రైల్వేస్టేషన్‌కు ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం నిత్యం జనసమర్థంగా ఉంటుంది. ఈ ప్రాంతంలోనే కాటికాపరిగా పనిచేస్తున్న కేఎస్ శ్రీను, మయూరి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. ఇటీవలే శ్రీను కుమార్తెకు వివాహం చేశారు. ఇదే ప్రాంతంలో పొట్ల కృష్ణ, ఉమా నూకరత్నం దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాటికాపరి శ్రీను కుమారుడైన సాయి కొద్ది నెలల క్రితం నుంచి ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న పొట్లకృష్ణ కుమార్తె యశోద భార్గవిని ప్రేమిస్తున్నాడు. భార్గవి కూడా అంగీకారం తెలపడంతో ఇరుకుటుంబాలు వీరి వివాహానికి ఓకే చెప్పాయి.
మూఢంతో పెళ్లి వాయిదా...
వీరిద్దరికీ గత పెళ్లిళ్ల సీజన్‌లోనే వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే అప్పటికే శ్రీను, మయూరి దంపతుల కుమార్తెకు పెళ్లి చేయడం.. తర్వాత మూఢం రావడంతో వీరి పెళ్లి నవంబర్ 11కి వాయిదా వేశారు.
అనుమానం పెనుభూతమైంది...
తాను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్న భార్గవి డీవీఎన్ కళాశాలకు చెందిన మరొక విద్యార్థితో చనువుగా ఉంటుందని సాయి అనుమానం పెంచుకున్నాడు. దీనితో సాయి మానసికంగా అదుపుతప్పాడు. భార్గవి ఇంటికి వెళ్లి ఇతరులతో చనువుగా ఉండొద్దని మందలించాడు. అయితే ఈ వ్యవహారం సద్దుమణుగుతుందని రెండు కుటుంబాలు భావించాయి. కానీ అలా జరగలేదు. అనుమానం పెనుభూతమైంది. సాయిని ఉన్మాదిగా మార్చాయి. భార్గవి తనకు దక్కదని అక్కసుతో బుధవారం కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ముందస్తు ప్లాన్ ప్రకారం...
భార్గవిపై దాడి చేసేందుకు సాయి ముందస్తుగానే పథకం సిద్ధం చేసుకున్నాడు. రోజూ భార్గవి రాకపోకలు సాగించే ప్రాంతాల్ని గుర్తించాడు. రామచంద్ర థియేటర్ సమీపంలో భార్గవి తాతకి చెందిన పాన్‌షాపు ప్రాంతాన్నే దాడికి ఎంచుకున్నాడు. దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న భార్గవి కుటుంబీకులు సాయిని నిలువరించడంతో పరిస్థితి చేయిదాటలేదని పోలీసులు చెబుతున్నారు. సాయి ఈ మధ్యే ఉద్యోగానికి కూడా ఎంపికైనట్టు ప్రచారం జరుగుతోంది. పెళ్లాడాల్సిన ప్రేమికురాలినే ఎందుకు చంపాలనుకున్నాడో తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో ప్రయత్నిస్తున్నారు. అనకాపల్లి ఎస్‌ఐ చక్రధర్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది సాయికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
Comments
Please login to add a commentAdd a comment