
కాపురానికి పంపలేదని కత్తితో దాడి
గుంతకల్ (అనంతపురం): భార్యను కాపురానికి పంపలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన ముగ్గురు బావమరదులపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్‌లోని హనుమేష్‌నగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో డ్రైవర్ అయిన ధనుంజయ్ స్థానికంగా పోర్టర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య నందిని ఆరు నెలల గర్భిణి. ఆమె మూడు రోజుల క్రితం పట్టణంలోని హనుమేష్‌నగర్‌లో తన పుట్టింటికి వెళ్లింది.
భార్యను వెంటనే కాపురానికి పంపించాలని ధనుంజయ్ ఫోన్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులను కోరాడు. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని, కుదుటపడిన తర్వాత పంపిస్తామని చెప్పారు. ఈ క్రమంలో బావకు సర్ది చెబుదామని నందిని సోదరులు గణేశ్, అనిల్, రాజా మంగళవారం సాయంత్రం ధనుంజయ్ ఇంటికి వెళ్లారు. కోపంతో ధనుంజయ్ కత్తితో వారిపై దాడి చేశాడు. గాయపడిన ముగ్గురినీ కర్నూలు ప్రభుత్వ ఆస్ప్రత్రికి తరలించారు. వీరిలో గణేశ్, రాజా పరిస్థితి విషమంగా ఉంది.